బంగ్లాదేశ్‌లో హసీనాకు పట్టిన గతి మీకు పట్టలేదని సంతోషించాలి- వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల తీవ్ర వ్యాఖ్యలు
కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు.

Nimmala Rama Naidu : మాజీ సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రావణాసురుడు రామాయణం చెప్పినట్లుగా వైఎస్ జగన్ మాటలున్నాయ్ అని ఆయన ధ్వజమెత్తారు. చేసిన తప్పులు పగలు-రాత్రి జగన్ కు గుర్తొస్తుండటంతో.. ఎక్కడ ఎరుపు రంగు కనిపించినా రెడ్ బుక్కే గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారాయన. కక్షలు, వేధింపులు, అరాచకాలు, హింస పేర్లు వింటే అందరికీ జగనే గుర్తుకొస్తాడని మండిపడ్డారు. ప్రజా తీర్పు ఓర్వలేను అన్నట్లుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అని జగన్ పై విరుచుకుపడ్డారు. నంద్యాల ఘటనలో ఎస్సీల భూమిని వైసీపీ నేత కబ్జా చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. గ్రామ పెద్ద వైసీపీ నేత నారప్ప రెడ్డికి భూమి తిరిగి ఇవ్వమని చెప్పటంతో అతనిపై దాడి చేయించారని చెప్పారు.
రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవను వ్యక్తిగత స్వార్ధం కోసం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. వినుకొండ ఘటనలో అసత్యాలు ప్రచారం చేయటంలో విఫలమై భంగపడిన రీతిలోనే ఇవాళ నంద్యాలలోనూ జగన్ బోల్తా పడ్డారని మంత్రి అన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని జగన్ గుర్తించాలని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
బంగ్లాదేశ్ లో హసీనాకు పట్టిన గతి జగన్ కు పట్టలేదు- మంత్రి నిమ్మల
”భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో అంతా చూశాం. ప్రధాని షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రజా విప్లవం వచ్చింది. ఒక ప్రజా విప్లవం వస్తే హసీనా దేశాన్నే విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే విధంగా 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లోనూ ఒక నిశబ్ద విప్లవం. అక్కడ ప్రజా విప్లవం జరిగింది. ఇక్కడ నిశబ్ద విప్లవం జరిగింది. దానికి, దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఒక రకంగా హసీనాకు పట్టిన గతి మన రాష్ట్రంలో జగన్ కు పట్టలేదు. కనీసం ఒక ఎమ్మెల్యేగానైనా.. మేము పాలన మెరుగ్గా చేయడానికి ఏదైనా ఆలోచనలు, సలహాలు ఉంటే ఇవ్వండి. రాష్ట్రాన్ని మరింత అంధకారంలోకి నెట్టేసేలా వ్యవహరించొద్దు. రాష్ట్రానికి, తెలుగు జాతికి ఇప్పటివరకు మీరు చేసిన ద్రోహం చాలు. భవిష్యత్తులో ఇంతకుమించి అన్యాయం చేయొద్దని జగన్ కు హితవు పలుకుతున్నా” అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
Also Read : సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు..! కేతిరెడ్డిలో సడెన్‌గా ఎందుకింత మార్పు, ఆ పార్టీలో చేరతారా?