త్వరలోనే ఆపరేషన్ బుడమేరు..!- మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

రిటైనింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో 35వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లే విధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టి పెడతాం.

త్వరలోనే ఆపరేషన్ బుడమేరు..!- మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

Operation Budameru : త్వరలోనే ఆపరేషన్ బుడమేరును ప్రారంభిస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. భవిష్యత్తులో బుడమేరు వల్ల విజయవాడకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని, వరద పోటెత్తకుండా చర్యలు చేపడతామని మంత్రి నిమ్మల తెలిపారు. రిటైనింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో 35వేల క్యూసెక్కుల నీరు వెళ్లే విధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టి పెడతామన్నారు మంత్రి నిమ్మల. నేరుగా వరద నీరు కొల్లేరు వెళ్లే విధంగా ఆపరేషన్ బుడమేరు తొందరలోనే ప్రారంభిస్తామని, భవిష్యత్తులో బెజవాడకు బుడమేరు భయం లేకుండా చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి నిమ్మల వెల్లడించారు.

”బుడమేరుకు మూడు గండ్లు పడి పెద్ద ఎత్తున వరద నీరు విజయవాడ సిటీని చుట్టుముట్టింది. ఆ సమయంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాం. ఓవైపు వాతావరణం సహకరించకపోయినా, మరోపక్క బుడమేరు ప్రవాహం పెరుగుతున్నా.. పరిస్థితులను ఎదుర్కొని వారం రోజుల పాటు కష్టపడి రాత్రి పగలు పని చేశాం. విజయవంతంగా గండ్లు పూడ్చాం. ఇటువంటి గండ్లను పూడ్చడం మీ వల్ల మాత్రమే సాధ్యమైందని మిలటరీ వాళ్లు సైతం ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు.

అత్యవసరంగా గండ్లను పూడ్చే సమయంలో టన్ను నుంచి 2 టన్నుల బరువు ఉండే రాళ్లను వాడాము. భవిష్యత్తులో మరోసారి వరద ముప్పు లేకుండా పనులు చేస్తాం. రాబోయే రోజుల్లో బండ్ ను మరింత పటిష్టం చేస్తాం. ఎప్పుడు వరదలు వచ్చినా అదే ప్రాంతాల్లో గండ్లు పడుతున్నాయి. అక్కడ గండ్లు పడకుండా పటిష్టం చేస్తాం. రిటైనింగ్ వాల్ కూడా కట్టి భవిష్యత్తులో 35వేల క్యూసెక్కుల నీరు కూడా వెళ్లే విధంగా లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కొల్లేరు ఆక్రమణలపైనా దృష్టి పెడతాం. నేరుగా నీరు కొల్లేరు వెళ్లే విధంగా ఆపరేషన్ బుడమేరు తొందరలోనే ప్రారంభిస్తాం. బుడమేరు విజయవాడకు దుఖ: దాయినిగా ఉంది. భవిష్యత్తులో బెజవాడకు బుడమేరు భయం లేకుండా చేసే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుంది” అని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు.

 

Also Read : నెల్లూరు మేయర్‌‌కు పదవీ గండం..! గద్దె దింపేందుకు కోటంరెడ్డి పక్కా వ్యూహం.!