Payyavula keshav: ఐదేళ్లు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు.. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ ఫైర్

వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం చాలా కష్టంగా మారిందని కేశవ్ తెలిపారు.

Payyavula keshav: ఐదేళ్లు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు.. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ ఫైర్

Minister payyavula keshav

Updated On : November 15, 2024 / 2:26 PM IST

Payyavula keshav: శాసనసభలో వార్షిక బడ్జెట్ పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఉగ్రవాది ప్రభుత్వంలోకి వస్తే ఆర్థిక విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో గత ఐదేళ్లు అనుభవంలోకి వచ్చిందని అన్నారు. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం చాలా కష్టంగా మారిందని కేశవ్ తెలిపారు. కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్ట లేనంతగా గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని అన్నారు. లెక్కలేనితనంతో గత ప్రభుత్వo చేసిన అప్పులను దోపిడి అనాలో..? ఆర్థిక అరాచకం అనాలో..? ఆర్థిక విధ్యంసం అనాలో..? తెలియట్లేదని కేశవ్ పేర్కొన్నారు.

Also Read: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం : మంత్రి లోకేశ్

ప్రతిశాఖలోనూ దేనికీ సరైన లెక్కలు, జమా ఖర్చులు లేవు. అంకెల గారడీతోనే గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది. కేంద్ర సంస్థలను తప్పుదారి పట్టించింది. ప్రభుత్వంలో ఉండగా అంకెల గారడీ చేసిన వాళ్లు.. విపక్షంలోకి వెళ్లాకకూడా అదే స్థాయిలో అంకెల గారడీ చేసి.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుoడటం బాధాకరమని పయ్యావుల కేశవ్ అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలే మనకు తిప్పలు తెచ్చి పెడుతున్నాయని చెప్పారు. కాంట్రాక్టర్లతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు జరిపే చెల్లింపులనూ పెండింగ్ లో పెట్టేశారు. పిడుగుపాటుకుగురై చనిపోయిన వాళ్ల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం కూడా పెండింగ్ లో పెట్టారు. వాటన్నింటినీ కూటమి ప్రభుత్వంలో చెల్లిస్తున్నామని పయ్యావుల తెలిపారు. పిల్లలకిచ్చే చిక్కీలు, చెత్తను శుభ్రం చేసే కార్మికుల జీతాలను పెండింగ్ లో పెట్టారు. ఇలాంటి చెల్లింపులు కూడా పెండింగ్ లో పెట్టి తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఖాజానాకు మాత్రం డబ్బులను యధేచ్ఛగా తరలించుకున్నారని గత ప్రభుత్వం పాలనపై కేశవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : AP Assembly 2024: అసెంబ్లీ లాబీలో చింతమనేని, పల్లె రఘనాథ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ.. కోడలు విషయం ప్రస్తావిస్తూ..

గత ప్రభుత్వం పెండింగులో బిల్లులు పెట్టడం వల్ల కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటే, అనేక సంస్థలను బ్యాంకులు వేలం వేశాయి. ఫీజు రీ-ఇంబర్స్ మెంట్ బకాయిలు పెట్టి.. లక్షలాది మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాల వద్ద చిక్కుకునేలా వారి జీవితాలను గత ప్రభుత్వం నాశనo చేసిందని పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సర్టిఫికెట్లను విద్యాశాఖ మంత్రి లోకేశ్ విడిపించి విద్యార్థులకు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో గ్రామాలను పునరుజ్జీవింప చేసేందుకు నరేగా నిధుల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి కొంత మందికి కనబడడం లేదు. గత ప్రభుత్వం డ్యాములకు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు పెట్టిందో నాటి సీఎం సొంత జిల్లాలోనే కొట్టుకుపోయిన అన్నమయ్య డ్యాం శిథిలాల వద్దకు వెళ్లి అడిగితే తెలుస్తుందని కేశవ్ అన్నారు.

 

ఇష్టారీతిన పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేసి డయాఫ్రం వాల్ విధ్వంసానికి కారణమయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కితే ఆ డబ్బులు తాడేపల్లి ఖజానాకు పోయాయి కానీ లబ్ధిదారులకు చేరలేదని కేశవ్ విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ గురించి ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడుతున్నారంటూ జగన్ తీరుపై పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలు కూడా తప్పులు ఎత్తి చూపేలా బడ్జెట్లో దొంగ లెక్కలు వేయించి, నిబంధనలను ఉల్లంఘించిన ఘనత గత ప్రభుత్వానిది. గత ప్రభుత్వ బడ్జెట్లో చేసిన అప్పులు చూపకుండా తిరిగి చెల్లింపులను మాత్రం చూపిన ఉల్లంఘనలు ఏమని చెప్పాలి. ఉండడానికి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కు తీసుకున్న అప్పుల చెల్లింపులు ప్రజలు చేయాలా..? చట్ట సభల అనుమతి లేకుండా రూ. 634 కోట్లను గత ప్రభుత్వం ఖర్చు చేసినట్లు కాగ్ చెప్పింది. ఈ అనుమతి లేని ఖర్చులు ఎవరి కోసం చేశారు..? ఎందుకోసం చేశారంటూ గత ప్రభుత్వం తీరుపై కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి విధ్వంసం, విశాఖ భూ దోపిడీ మీ అరాచకం కాదా..? అవినీతి సామ్రాట్.. అరాచక మహరాజ్, విధ్వంస వీరుడు అని బిరుదులిచ్చి జగన్ కు అవార్డులివ్వాల్సిందేనని కేశవ్ ఎద్దేవా చేశారు.

ప్రజా సంక్షేమంకోసం పేదలకు మేలు చేసే కార్యక్రమాలు మాత్రమే కూటమి ప్రభుత్వం చేస్తోందన్న కేశవ్.. తొలిసారి బడ్జెట్ పెట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. పేదల సంక్షేమం తెలుగుదేశం విధానం.. అభివృద్ధి చంద్రబాబు నినాదం.. ఈ స్ఫూర్తితో బడ్జెట్ కసరత్తు చేశాం. సంక్షేమం, అభివృద్ధి రెండింటిని సమపాళ్లల్లో ఉండేలా బ్యాలెన్స్ చేసుకుంటూ బడ్జెట్ ప్రవేశపెట్టామని పయ్యావుల కేశవ్ చెప్పారు.