Perni Nani : కాఫీకి పిలిస్తే వెళ్లా, బాబు భరించలేకపోతున్నారు-పేర్నినాని
ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని అన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఇండస్ట్రీకి చేసింది ఏమైనా ఉందా?

Perni Nani
Perni Nani : సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని కౌంటర్ ఇచ్చారు. సినిమా వాళ్లు చంద్రబాబు దగ్గరకి వెళ్తే తప్పు లేదు కానీ, సీఎం జగన్ దగ్గరికి వస్తే తప్పా? అని మంత్రి ప్రశ్నించారు. అసలు ఈ సమస్యని సృష్టించింది చంద్రబాబు అయితే, పరిష్కారం చూపింది సీఎం జగన్ అని మంత్రి అన్నారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఇండస్ట్రీకి చేసింది ఏమైనా ఉందా? అని నిలదీశారు. సినిమా వాళ్లను చంద్రబాబు తన రాజకీయాలకు వాడుకున్నారని మంత్రి పేర్నినాని ఆరోపించారు.
నచ్చిన వాళ్లకి ఒక రకంగా..నచ్చని వాళ్లకి ఒక రకంగా చేశారని చెప్పారు. గుణశేఖర్ ని అడిగితే.. చంద్రబాబు కారణంగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్తారని అన్నారు. చిరంజీవి ఆడియో ఫంక్షన్ జరగనివ్వకుండా చంద్రబాబు అడ్డుకోలేదా? అని మంత్రి పేర్నినాని అడిగారు. సినిమా స్టార్లతో ప్రభుత్వం జరిపిన మీటింగ్ లో ఏం జరిగిందో చంద్రబాబు కుర్చీల కింద కూర్చుని విన్నాడా? అని ప్రశ్నించారు.
జగన్ ని కలిసేందుకు వచ్చిన వాళ్లకి వైసీపీ సభ్యత్వాలు ఉన్నాయా? అని మంత్రి అడిగారు. మీ దగ్గరకి వచ్చి వాటేసుకుంటే సక్రమమా? మా దగ్గరకి వచ్చి సమస్య పరిష్కారం చేసుకుంటే ఈర్ష్య ఎందుకు? అని మంత్రి పేర్నినాని ఫైర్ అయ్యారు. నేను ట్విట్టర్ మంత్రిని అనుకుంటున్నారా? సినిమాటోగ్రఫీ మంత్రిని అనుకుంటున్నారా..? అందరి ట్వీట్లకు సమాధానం చెప్పడానికి అని మంత్రి పేర్నినాని మండిపడ్డారు.
తాను మోహన్ బాబు ఇంటికి వెళ్లి కలిసిన అంశంపైనా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ”హైదరాబాద్ లో మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహానికి హాజరయ్యాను. అక్కడ మోహన్ బాబు కలిసి ఇంటికి కాఫీకి ఆహ్వానించారు. సమావేశానికి ఆహ్వానం రాలేదని ఆయన నాతో అన్నారు. సీఎంకి చెప్పామన్నారు. వచ్చేప్పుడు వాళ్ల అబ్బాయి విష్ణు శాలువా కప్పి సన్మానించారు. ప్రభుత్వం నుండి వివరణ ఇవ్వడానికి నేను వెళ్లలేదు. వ్యక్తిగతంగా వెళ్లాను. మా ప్రభుత్వం ఎవరికీ సంజాయిషీ ఇవ్వదు” అని మంత్రి పేర్నినాని అన్నారు.
”హైదరాబాద్ లో నేను మోహన్ బాబు ఇంటికి వెళ్లింది స్నేహపూర్వకంగానే. మోహన్ బాబుతో 2002 నుంచి పరిచయం ఉంది. కాఫీకి పిలిస్తే మోహన్ బాబు ఇంటికి వెళ్లా. అంతే తప్ప ప్రభుత్వం తరఫున ఎవరికీ సంజాయిషీ ఇవ్వడానికి కాదు. తాను చెప్పిన తర్వాతే మంచు విష్ణు తన ట్వీట్ ను అప్ డేట్ చేశారు” అని మంత్రి పేర్నినాని వివరణ ఇచ్చారు.
Copper Rings : రాగి ఉంగరాలు, కడియాలు ధరిస్తే ఏమౌతుందో తెలుసా?
మోహన్ బాబుతో సమావేశంలో వారి విద్యాసంస్థలు, ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నామని మంత్రి వెల్లడించారు. సీఎంతో సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని మోహన్ బాబు చెప్పారని, ఒకవేళ పిలిచి ఉంటే తప్పకుండా వచ్చేవాడినని కూడా ఆయన చెప్పారని పేర్నినాని తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్నినాని వెల్లడించారు. కానీ చంద్రబాబు మాత్రం ఓర్వలేకపోతున్నారని అన్నారు. సినీ పరిశ్రమ సంక్షేమం కోసం ఏనాడు పాటుపడని వ్యక్తి చంద్రబాబు అని, సీఎంతో సినీ ప్రముఖుల చర్చలు ఫలవంతం కావడం పట్ల భరించలేకపోతున్నాడని విమర్శించారు.
”సినిమా వాళ్లు తమ సమస్యలకు పరిష్కారం లభించిందని ఆనందిస్తుంటే, చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. నిన్న సీఎంతో సమావేశానికి చంద్రబాబు కూడా ఏమైనా వచ్చారా? మహేశ్ బాబు కుర్చీ కిందో, ప్రభాస్ కుర్చీ కిందో దాక్కున్నారా? చంద్రబాబు మాటల్లో ఈర్ష్య తప్ప మరొకటి కనిపించడం లేదు” అని మంత్రి ఫైర్ అయ్యారు.
సినీ పరిశ్రమ సమస్యలపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. సమస్యలు సృష్టించేది వారే, పరిష్కరించాం అని చెప్పేదీ వారే అని అన్నారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మంత్రి పేర్నినాని ఘాటుగా బదులిచ్చారు.