Botcha Satyanarayana : మీలా మోసం, దగా చేసే అలవాటుంటే మేము కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం- బొత్స సత్యనారాయణ
జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు.

Botcha Satyanarayana : సభలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను సభలో ప్రస్తావించి పరిష్కారానికి ప్రయత్నం చేశామని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ ప్రభుత్వం మార్షల్స్ ను తెచ్చి తమను సభ నుంచి బయటికి పంపించేందుకు చూసిందని ఆయన ఆరోపించారు. సూపర్ సిక్స్ కు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని బొత్స ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
ఓటేశారు.. మేం గెలిచాం… ఇక దోచుకుంటే సరిపోతుందనే భావనలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. 15 రోజుల సభలో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు బొత్స చెప్పారు. రాబోయే రోజుల్లోనైనా ప్రజలకు మంచి చేస్తారని మేము ఆశిస్తున్నామన్నారు. ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం లేదన్నారు బొత్స సత్యనారాయణ. శాసనమండలి మీడియా పాయింట్ లో మాట్లాడిన బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
Also Read : ఈసారి ఏ బాంబు పేలుస్తారో..! వైసీపీలో విజయసాయిరెడ్డి టెన్షన్..
”వర్గీకరణ కోసం షెడ్యూల్ కులాలు పోరాడుతున్నాయి. వర్గీకరణ కోసం పోరాడిన వారిపై టీడీపీ కేసులు పెట్టింది. ఆ కేసులను ఎత్తేసిన ఘనత జగన్ మోహన్ రెడ్డిది. అన్ని కులాల వారికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టుపై చర్చ లేకుండా ప్రకటన ఇచ్చారు. అసలు వర్గీకరణ ఎలా చేశారు? ఏ విధంగా చేశారో? కనీస చర్చలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను కాపాడుకోవాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరవైంది.
జగన్ అన్ని కులాలను గౌరవించారు. పదవుల్లోనూ అందరికీ న్యాయం చేశారు. అంబేద్కర్ స్మృతివనం పెడితే ఈ ప్రభుత్వానికి కన్ను కుట్టింది. అట్టడుగు వర్గాల వారికి గౌరవం ఇవ్వడం ఈ ప్రభుత్వానికి నచ్చదు. అట్టడుగు వర్గాలపై ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైన ద్వేషం. ఈ ప్రభుత్వం తీరును మేం తప్పుపడుతున్నాం. గౌరవంగా అన్ని వర్గాలు జీవించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. అందరికీ మంచి చేయాలనే మేం కోరుతున్నాం. అధికార పార్టీ సభ్యులు రోజూ చెప్పిందే చెబుతున్నారు. రోజూ ఆవు కథ చెబితే ఎలా?
Also Read : దొంగల్లా వచ్చిపోతున్నారు.. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్
ఎన్నికల ముందు చేసిన ప్రచారాలు… హామీలు మర్చిపోయారా? కూటమి మాదిరి మోసం దగా వైసీపీకి అలవాటు లేదు. అదే అలవాటు వైసీపీకి ఉంటే మేము కూడా 100 అబద్ధాలు చెప్పేవాళ్లం” బొత్స సత్యనారాయణ అన్నారు.