రూ.950 కోట్లు ఏమయ్యాయి? ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కామ్? చర్యలు చేపట్టిన కొత్త ప్రభుత్వం

దాదాపు 950 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? అనే అంశానికి సంబంధించి త్వరలోనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది.

రూ.950 కోట్లు ఏమయ్యాయి? ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కామ్? చర్యలు చేపట్టిన కొత్త ప్రభుత్వం

AP Fibernet : ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కొత్త సర్కార్ చర్యలు చేపట్టింది. ఫైబర్ నెట్ కార్యాలయాన్ని సీజ్ చేసింది. త్వరలోనే విచారణ కమిటీ వేయనుంది సర్కార్. రూ.950 కోట్ల రుణాలు తీసుకొచ్చిన సంస్థ.. అభివృద్ధికి వినియోగించలేదని అభియోగం మోపింది. ఫైబర్ నెట్ సంస్థ ఎండీ మెయిల్ ఐడీ, లాగిన్ ఫ్రీజ్ చేసింది సర్కార్.

వివిధ శాఖలకు సంబంధించి ఇప్పటికే నిలుపుదల చేయడం, అక్కడున్న సిబ్బందిపై విచారణకు ఆదేశించన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ లో పెద్ద స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయనే అభియోగాల నేపథ్యంలో.. ఆ కార్యాలయాన్ని కూడా సీజ్ చేసింది. కార్యాలయ సిబ్బందిని కూడా పంపేశారు. అత్యవసర సర్వీసులను ఆన్ లైన్ లో అందించాలని ఆదేశించింది. ఫైబర్ నెట్ సంస్థ ఎండీ మధుసూదన్ రెడ్డిని సెలవుపై పంపించారు. దాదాపు 950 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? అనే అంశానికి సంబంధించి త్వరలోనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఏపీ ఫైబర్ నెట్ లో జరిగిన అక్రమాలు, అవినీతికి సంబంధించిన అంశాలన్నీ వెలుగులోకి తెస్తామని గతం నుంచి కూడా టీడీపీ చెబుతూ వస్తోంది. పొలిటికల్ గా ఉన్న అనేక రకాల సిఫార్సులకు కేంద్ర బిందువుగా ఏపీ ఫైబర్ నెట్ నిలిచిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. అన్ని రకాల పొలిటికల్ సిఫార్సులు, 1500 మందికిపైగా ఉచితంగా ఇక్కడ ఉపాధి కల్చించి వారందరికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు జీతాలు ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా రాజకీయపరమైన సిఫార్సులతోనే చేస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి. దాదాపు 9లక్షల 75వేలుగా ఉన్న కనెక్షన్లు.. ఇవాళ దాదాపుగా 4.5 లక్షలకు వచ్చాయంటే పూర్తి స్థాయిలో ఆ సంస్థకు సంబంధించిన యంత్రాంగం వైఫల్యంగానే భావించాల్సిన పరిస్థితి.

Also Read : చంద్రబాబు చేతిలో చెయ్యేసి పవన్ కల్యాణ్ భావోద్వేగ ప్రసంగం..

సెట్ టాప్ బాక్సులు, ఇతర పరికరాల కొనుగోళ్లు, సిబ్బంది నియామకాల్లో జరిగిన అవకతవకలపై కచ్చితంగా విచారణ చేస్తామని టీడీపీ పేర్కొన్న నేపథ్యంలో విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టేషన్ లో ఉన్న ఏపీ ఫైబర్ నెట్ రాష్ట్ర కార్యాలయాన్ని సీజ్ చేశారు. సంస్థ ఎండీని కూడా సెలవుపై పంపేశారు. అత్యవసర సేవలను అందించడానికి ఆన్ లైన్ లో కొంతమంది సిబ్బందిని మాత్రమే ఉంచారు. మిగతా సిబ్బంది ఎవరినీ ఆఫీసులోకి వెళ్లనివ్వడం లేదు. పోలీసుల భద్రతలో ఫైబర్ నెట్ కార్యాలయం ఉంది. రేపు మంత్రివర్గ ప్రమాణస్వీకారం అయిపోయాక ఏపీ ఫైబర్ నెట్ అంశంపై విచారణ కమిటీని నియమించే అవకాశం ఉంది.