తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలుగు సేన పార్టీ ధర్నా

తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటైంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను రాజకీయంగా అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తెలుగు సేన పార్టీ ధర్నా

Telugu Sena Party, Sathya Reddy

Telugu Sena Party Dharna : తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సినీ దర్శక నిర్మాత సత్యారెడ్డి తెలుగుసేన పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. తెలుగుసేన పార్టీ అధ్యక్షుడుగా సత్యారెడ్డి ఎన్నికయ్యారు. గద్దర్ చివరిగా నటించిన ఉక్కు సత్యాగ్రహం సినిమాను సత్యారెడ్డి నిర్మించారు. అయ్యప్ప దీక్ష, ప్రశ్నిస్తా, సర్దార్ చిన్నపరెడ్డి సహా 53 సినిమాలను ఆయన తీశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిని, ఉద్యమాలను, ఉద్యమ సినిమాలను రాజకీయంగా అడ్డుకుంటున్నందుకు రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సత్యారెడ్డి ప్రకటించారు. ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఏపీ భవన్ లో తెలుగుసేన పార్టీని ఆయన ప్రకటించారు.

కాగా, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలుగు సేన పార్టీ ధర్నా చేపట్టింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా, స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ధర్నా చేపట్టింది. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ధర్నాలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : సలార్ మూవీ రివ్యూ.. సినిమాలో ఎలివేషన్స్ కాదు.. ఎలివేషన్స్‌తోనే సినిమా..

ఈ సందర్భంగా తెలుగుసేన పార్టీ అధ్యక్షులు సత్య రెడ్డి మాట్లాడుతూ.. గద్దర్ ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగు సేన పార్టీ ఉద్భవించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం తెలుగు సేన పార్టీ పోరాడుతుందని తెలిపారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేన ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాయి కానీ పోరాడటం లేదని విమర్శించారు. వైసీపీ, టీడీపీ, జనసేన ఏపీ కోసం ప్రత్యక్ష పోరాటాల్లోకి దిగాలని సూచించారు. జనవరిలో విశాఖపట్నంలో భారీ బహిరంగ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలుగువారి హక్కుల కోసం తెలుగు సేన పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.