విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం

విజయవాడ కోవిడ్ ఆస్పత్రిలో వృద్ధుడి అదృశ్యం కలకలం రేపుతోంది. వసంతరావు అనే వృద్ధుడు వారం రోజుల నుంచి కనిపించడం లేదు. జూన్ 25 నుంచి ఇప్పటివరకు వసంతరావు ఆచూకీ తెలియడం లేదు. గత నెల 24న వసంతరావును ఆయన భార్య ఆస్పత్రిలో చేర్పించారు. వీల్ చైర్ లో ఆస్పత్రి సిబ్బంది లోపలికి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇక పల్స్ పడిపోతుందని ఆక్సిజన్ పెట్టాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పినట్లు వసంతరావు భార్య చెబుతున్నారు. ఆ తర్వాత నుంచి తన భర్త కనిపించడం లేదని ఆమె అంటున్నారు.
అయితే ఆస్పత్రి సిబ్బంది మరోలా చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి వసంతరావు పారిపోయాడని చెప్పారు. ఆస్పత్రి వర్గాల వాదనను వసంతరావు కుటుంబ సభ్యులు ఖండిస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా పారిపోయాడో ఆస్పత్రి వర్గాలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల క్రితం నుంచి ఆయన ఆచూకీ లభించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్ ఆస్పత్రి నుంచి వసంతరావు అనే వృద్ధుడు అదృశ్యమవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. జూన్ 24వ తేదీన వసంతరావు, ఆయన భార్య ఇద్దరూ ఆయసం వస్తుందని ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రికి వెళ్లిన భర్త, భార్యకు టెస్టులు చేయగా భర్త వసంతరావుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది.
అయితే కోవిడ్ పాజిటివ్ అని తేలినప్పటికీ చాలా సేపటి వరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో వృద్ధురాలు ఆస్పత్రి సిబ్బందిని అడగడంతో అక్కడున్న వీల్ చైర్ మీద వసంతరావును లోపలికి తీసుకెళ్లారు. సాయంత్రం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆయన ఆస్పత్రిలోనే ఉండాలి ఇక్కడి నుంచి మీరు వెళ్లి పోవాలంటూ భార్య ధనలక్ష్మీకి చెప్పడంతో అక్కడి నుంచి ఆమె ఇంటికి వచ్చేసింది.
Read:ఏపీలో 16వేలు దాటిన కరోనా కేసులు