జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50లక్షలు.. ఐదెకరాల భూమి.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. ఇంకా..

మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా అండగా ఉంటాయని పవన్ కల్యాణ్ భరోసా కల్పించారు.

జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి రూ.50లక్షలు.. ఐదెకరాల భూమి.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.. ఇంకా..

Pawan Kalyan

Updated On : May 11, 2025 / 12:26 PM IST

Jawan Murali Naik: భారత్ – పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీనాయక్ పార్థీవదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం మురళీనాయక్ పార్ధివ దేహానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మురళీనాయక్ తల్లిదండ్రులను పవన్, లోకేశ్ దగ్గర కూర్చోబెట్టుకొని ఓదార్చారు. అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.

Also Read: ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను హత్తుకొని కన్నీరుమున్నీరైన జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రులు.. వారిని దగ్గర కూర్చొబెట్టుకొని ఓదార్చిన పవన్, లోకేశ్

మురళీ నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మురళీ నాయక్ కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఐదెకరాల భూమి, ఇంటికోసం 300 గజాల స్థలం, మురళీ నాయక్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని అన్నారు. మురళీ నాయక్ మెమోరియల్ కట్టాలని నిర్ణయించామని, జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కాంస్య విగ్రహ నిర్మాణం ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా తన వ్యక్తిగతంగా జవాన్ కుటుంబానికి రూ.25లక్షల సాయం అందిస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

మన దేశ బలాన్ని చూసి పాకిస్థాన్ కాళ్ల బేరానికి వచ్చింది. అందుకే సీజ్ ఫైర్ చేయాలని వేడుకుంది. పాకిస్థాన్ కాళ్ల మీద పడటంతోనే ప్రధాని నరేంద్ర మోదీ దీనికి ఒప్పుకున్నారు. కానీ, సీజ్ ఫైర్ చేసిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ కాల్పులకు పాల్పడింది. పాకిస్థాన్ ఉగ్రవాదుల వలన ఎంతో మంది ప్రాణాలు పోయాయి. మళ్లీ అలాంటి కుట్రలకు పాల్పడాలని చూస్తోంది. దేశంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ప్రధాని మోదీ, భారత ఆర్మీకి మనమంతా అండగా ఉండాల్సిన సమయం ఇదని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read: India Pak Ceasefire: కశ్మీర్ సమస్య పరిష్కారంకోసం.. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన

నారా లోకేశ్ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో పోరాడుతూ మురళీ నాయక్ వీరమరణం పొందారు. చిన్నప్పటి నుంచి సైనికుడు కావాలని కలలుకన్నారు. దేశం కోసం పోరాడిన వ్యక్తి వీరజవాన్ మురళీ నాయక్. సరిహద్దుల్లో సైనికుల త్యాగాల వల్లే మనం సురక్షితంగా ఉండగలగుతున్నాం. చిన్న వయస్సులోనే అగ్నివీర్ మురళీనాయక్ చనిపోవడం బాధాకరం. మురళీ నాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50లక్షల పరిహారం, ఐదె ఎకరాల పొలంతోపాటు 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. వీరజవాన్ మురళీ నాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని లోకేశ్ చెప్పారు.

అనంతరం మురళీ నాయక్ అంతిమయాత్రలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని వీరుడా వందనం అంటూ.. తుది వీడ్కోలు పలికారు.