Ram Gopal Varma: ఐటీ ఉద్యోగులు సరే.. అసలు లబ్ధిపొందిన వారు ఎక్కడ?
వందో, రెండు వందల మందో హైదరాబాద్ ఐటీ ఎంప్లాయిస్ రాజమండ్రి జైలు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే.. కానీ, స్కిల్ స్కీంలో డైరెక్ట్ గా లబ్ధిపొందారని చెప్పబడుతున్న రెండు లక్షల మంది ఎక్కడికి పయారు?

Ram Gopal Varma
Ram Gopal Varma Tweet: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. చంద్రబాబును రాజకీయకక్షతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. మరోవైపు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు, దేశాల్లో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పలువురు నిరసన తెలుపుతున్నారు. ముఖ్యంగా.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు పెద్దఎత్తున రోడ్లపైకివచ్చి నిరసన తెలుపుతున్నారు. హైదరాబాద్, బెంగళూరులతో పాటు పలు ప్రాంతాల్లో చంద్రబాబుకు మద్దతుగా ఆందోళనలు చేపడుతున్నారు.
గత శుక్రవారం ఏపీకి చెందిన ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి కార్ల ర్యాలీని నిర్వహించ తలపెట్టారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ భారీ కార్ల ర్యాలీగా రాజమండ్రి చేరుకొని నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపేందుకు నిర్ణయించారు. అయితే, ఏపీ పోలీసులు వీరిని ఏపీ- తెలంగాణ బోర్డర్‌లో కార్ల ర్యాలీకి అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఐటీ ఉద్యోగులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ర్యాలీ చేపడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఏపీ బోర్డర్ నుంచి కొందరు ఐటీ ఉద్యోగులు వెనక్కి తిరిగి హైదరాబాద్ రాగా, మరికొందరు పోలీసులు కళ్లుగప్పి రాజమండ్రి వెళ్లారు.
Read Also : Chandrababu Arrest: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. రేపు విచారణ
మరోవైపు టీడీపీ హయాంలో నిర్వహించిన స్కిల్ డెవలప్ మెంట్ స్కీంలో అవినీతి జరగలేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దాదాపు రెండు లక్షల మందికి ఈ స్కీం ద్వారా శిక్షణ పొందారని, అనేక మందికి ఉద్యోగులుసైతం వచ్చాయని పేర్కొంటున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘వందో, రెండు వందల మందో హైదరాబాద్ ఐటీ ఎంప్లాయిస్ రాజమండ్రి జైలు దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే.. కానీ, స్కిల్ స్కీంలో డైరెక్ట్ గా లబ్ధిపొందారని చెప్పబడుతున్న రెండు లక్షల మంది ఎక్కడికి పయారు?’ అంటూ వర్మ ప్రశ్నించారు.
వందో ,రెండు వందల మందో హైదరాబాద్ I T ఎంప్లాయిస్ జైల్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తున్నారు సరే కానీ , స్కిల్ స్కీం లొ డైరెక్ట్ గా లబ్ధి పొందారని చెప్పబడుతున్న రెండు లక్షల మంది ఎక్కడకి పోయారు? 😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) September 26, 2023