రామతీర్థం ఆలయ ఛైర్మన్‌గా అశోక్ గజపతి తొలగింపు, బాబు ఫైర్

Ashok Gajapathi as Chairman of Ramatirtha Temple : ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థం ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌గా మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును తొలగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రామతీర్థంపై గొడవలు జరుగుతున్న క్రమంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. రామతీర్థం దేవాలయం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్‌గా ఉన్నారాయన.
రామతీర్థంతో పాటు పైడితల్లి, మందపల్లి ఆలయ ట్రస్టుల నుంచి కూడా తొలగించారు. రామతీర్థం ఘటనలో బాధ్యుడిని చేస్తూ..ఏపీ ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. భద్రతాపరమైన చర్యల పర్యవేక్షణలో అశోక్ గజపతి రాజు విఫలమయ్యారని ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రామతీర్థంకు వచ్చిన చంద్రబాబు..బహిరంగసభలో ప్రసంగం ముగియగానే..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ చర్యపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజుపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ జీవోలు కోర్టులో చెల్లవని, ఈ జీవోలు కక్షసాధింపు చర్యలు కావా ? ప్రశ్నించారాయన.
అసలు ఏం జరిగింది ? :-
ఐదు రోజుల క్రితం రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేయడంతో వివాదం మొదలయింది. శ్రీరామచంద్రుని విగ్రహం తల భాగాన్ని పూర్తిగా తొలగించివేసి కోనేరులో పడేశారు దుండగులు. ఈ నెల 29న ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఉదయంపూట ఎప్పటిలానే కొండపైకి వెళ్లి ఆలయం తలుపులు తీసిన పూజారి…శిరస్సులేని రాముడి విగ్రహం చూసి హతాశుడయ్యారు. వెంటనే విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి విస్తృతంగా గాలించగా…కోనేరులో విగ్రహం తల లభించింది.
స్థానిక పోలీసులతో పాటు ఎస్పీ..గర్భాలయంలోకి వెళ్లి విగ్రహాన్ని పరిశీలించారు. ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి దర్యాప్తు జరిపారు. ఇటీవల కాలంలో కొండపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అయితే సీసీటీవీ లేకపోవడంతో…ఈ దారుణానికి పాల్పడింది ఎవరన్నదానిపై ఆధారాలు సేకరించడం పోలీసులకు కష్టంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. విగ్రహం ధ్వంసం గురించి తెలుసుకున్న స్థానిక భక్తులు..కొండపైకి భారీగా చేరుకుని ఆందోళన జరిపారు.
విగ్రహ ధ్వంసంపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఐదురోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీసీ ఎంపీ విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఒకేసారి రామతీర్థంకు రావడంతో రాజకీయ రగడ ముదిరింది.