Sajjala Ramakrishna Reddy : ప్రజలు ఆందోళన చెందొద్దు, మళ్లీ జగనే సీఎం- సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్
Sajjala Ramakrishna Reddy: నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది. ప్రజలు ఆందోళన చెందొద్దు. మళ్లీ జగనే సీఎం.

Sajjala Ramakrishna Reddy (Photo : Google, Twitter)
Sajjala Ramakrishna Reddy – Early Elections : ఏపీలో ముందస్తు ఎన్నికలు, వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం, బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం తదితర వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్.. ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై సజ్జల స్పందించారు.
ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం మాకు లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పేశారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటామన్నారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లేది రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించే అని ఆయన చెపపారు. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి కేంద్రం పెద్దలను జగన్ అడిగారని సజ్జల తెలిపారు.
”ముందస్తు అనేది చంద్రబాబు గేమ్ ప్లాన్ మాత్రమే. పవన్ కల్యాణ్ తో 5-6 సీట్ల గురించి చర్చించుకునేందుకు ప్రచారం చేసుకుంటున్నారు. ఊగలాడే వారిని పార్టీలోకి చేర్చుకునేందుకు చంద్రబాబు, పవన్ ఆడే గేన్ ప్లాన్ ఇది. ఒకరకంగా ఇది జనాన్ని మోసం చేయటమే. ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదు. ఇప్పటికే అనేకసార్లు ఈ విషయాన్ని స్పష్టం చేశాం. అయినా, ముందస్తు ఎన్నికలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అలాంటి వార్తల్లో నిజం లేదు. జగన్ కి ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలం వరకూ అధికారంలో ఉంటాం. ఐదేళ్ల కాలం చివరి వరకూ సీఎం జగన్ ఈ రాష్ట్రాన్ని పాలిస్తారు. సంక్షేమ పథకాలు జనానికి బాగా అందుతున్నాయి. జనం కూడా మాపై పాజిటివ్ గా ఉన్నారు. అందుకే నేషనల్ మీడియా చేసిన సర్వేలో కూడా వైసీపీకి అనుకూలంగా వచ్చింది.
చంద్రబాబు ఏం చేసినా ముందస్తు ఎన్నికలు రావు. ప్రజలు ఆందోళన చెందొద్దు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతోంది. ప్రభుత్వం చేపట్టిన పథకాలే జగన్ ను మళ్లీ సీఎం చేస్తాయి.
అమరావతిలో పేదలకు ఇళ్లు రాకూడదని టీడీపీ కోరుకుంటోంది. పేదలకు ఇళ్లు ఇస్తామంటే ఎవరైనా వద్దంటారా? ల్యాండ్ పూలింగ్ లో వచ్చిన ప్రభుత్వ భూమే అది. అందులో ఇళ్లు కడితే తప్పేముందీ? ఐదు శాతం పేదలకు ఇవ్వాలని చట్టంలోనే ఉంది. మంచికోణంలో చూస్తే మంచి కనిపిస్తుంది. షర్మిలమ్మ పార్టీ పెట్టుకున్నాక వారి నిర్ణయాలు వారిష్టం. ఎక్కడ పోటీ చేస్తారో వారిష్టం. బీజేపీ ఎవరిని అధ్యక్షుడిగా పెట్టుకుంటుందో వారిష్టం. వారితో మాకేం పని? మీడియా చేసే ప్రచారాలతో మాకు సంబంధం ఏంటి?” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.