Selfie Challenge: సీదిరి, శిరీష సవాళ్ల పర్వం.. ఇలాంటిది ఒక్కటైనా కట్టారా? సగం రంగులేసి సెల్ఫీలా?
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సెల్ఫీ సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

గౌతు శిరీష, సీదిరి అప్పలరాజు (Photo: Twitter)
Selfie Challenge in AP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెల్ఫీ వార్ నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష నాయకుల సెల్ఫీలతో సవాళ్లు విసురుకుంటున్నారు. తామే ఎక్కువ అభివృద్ది చేశామని పరస్పరం సెల్ఫీలతో ప్రకటించుకుంటున్నారు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రతి నియోజకవర్గంలో సెల్ఫీలతో అధికార పక్షానికి సవాల్ విసురుతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా స్వీయ చిత్రాలతో సీఎం జగన్ ను సవాల్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ, టీడీపీ నాయకులు కూడా సెల్ఫీ వార్ మొదలుపెట్టారు.

జగన్ మాస్క్ తో సీదిరి అప్పలరాజు సెల్ఫీ (Photo: Twitter)
చంద్రబాబుకు అప్పలరాజు సవాల్
చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) ప్రతిపక్ష నాయకుడికి సెల్ఫీ సవాల్ విసిరారు. తన నియోజకవర్గం పలాసలో కడుతున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ముందు సెల్పీ తీసుకుని ట్విటర్ లో చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. ‘200 పడకల ఆస్పత్రితో కూడిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం తుది దశకు చేరుకుందని.. ఇలాంటి నిర్మాణం ఒక్కటైనా చేశావా?, కనీసం చేయాలన్న ఆలోచనైనా నీకు వచ్చిందా??’ అంటూ ప్రశ్నలు సంధించారు. టిడ్కో ఇళ్ళ ఛాలెంజ్ లో డొల్లతనాన్ని బయటపెడితే తిరిగి సమాధానం కూడా చెప్పలేక దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు పడ్డారని విమర్శించారు. కాగా, సీఎం జగన్ మాస్క్ ధరించి మంత్రి అప్పలరాజు ఫొటోలు దిగడం చర్చనీయాంశంగా మారింది.

గౌతు శిరీష (Photo: FB)
మంత్రి అప్పలరాజుకు శిరీష సవాల్
మంత్రి సీదిరి అప్పలరాజు సెల్పీ చాలెంజ్ పై పలాస నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీష (Gouthu Sireesha) స్పందించారు. టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీ దిగి మంత్రి అప్పలరాజుకు సవాల్ విసిరారు. తమ హయాంలో 95 శాతం నిర్మాణ పనులు పూర్తి చేసినా నేటికి నిర్మాణం పూర్తి చేసి లబ్ది దారులకు ఇవ్వలేదని ఆక్షేపించారు. అసంపూర్తిగా ఉన్న కిడ్నీ రిసెర్చ్ సెంటర్ కు రంగులు వేసి సెల్ఫీలు దిగడం హాస్యాస్పదంగా ఉందని.. ఎన్నికల లోపైనా పూర్తి చేస్తారా అంటూ ఎద్దేవా చేశారు.
Also Read: మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా?
రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లోనూ అధికార, విపక్ష నాయకుల మధ్య సెల్ఫీ సవాళ్లు కొనసాగుతున్నాయి. తాము గొప్పంటే, తాము గొప్పని నాయకులు స్వీయ చిత్రాలతో హోరెత్తిస్తున్నారు. టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లతో ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.