Seediri Appalaraju : ఆంధ్ర ప్రజలను తక్కువ చేసి మాట్లాడొద్దు, హరీశ్ రావు గిల్లుడు మానుకోవాలి-మంత్రి అప్పలరాజు
Seediri Appalaraju: అసలే రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేకపోతున్నం. అది చాలదన్నట్లు ఇంకా అవమానకరంగా మాట్లాడితే తీవ్రంగా స్పందించాల్సి అవసరం ఉందని భావిస్తున్నా.

Seediri Appalaraju (Photo : Google)
Seediri Appalaraju : తెలంగాణ నేతలు ఆంధ్రా వారిని తక్కువ చేసి మాట్లాడొద్దని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు కోరారు. తెలంగాణ మంత్రులు ఇకనైనా అభ్యంతరకర వ్యాఖ్యలు మానుకోనాలని సూచించారు. అనేక సందర్భాల్లో తెలంగాణ నేతలు ఏపీని తక్కువ చేసి మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. ప్రతీ సారీ అలా వ్యాఖ్యలు చేయడంతో తాను తీవ్ర స్థాయిలో ప్రతి స్పందించాల్సి వచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పుకొచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పారదర్శక పాలన చేస్తున్నాం అని మంత్రి అప్పలరాజు చెప్పారు. కానీ తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు గిల్లుతూ ఉన్నారని మండిపడ్డారు. మా ముఖ్యమంత్రిని ఎవరైనా ఏదైనా అంటే నిలువరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. అసలే రాష్ట్ర విభజనను జీర్ణించుకోలేకపోతున్నం. అది చాలదన్నట్లు ఇంకా అవమానకరంగా మాట్లాడితే తీవ్రంగా స్పందించాల్సి అవసరం ఉందని తాను భావిస్తున్నా అని మంత్రి అప్పలరాజు అన్నారు.
సీఎం జగన్ ఎప్పుడూ పక్క రాష్ట్రాలతో స్నేహపూరకంగానే ఉంటారని చెప్పారు. మనమంతా ఒకే కుటుంబం లాంటి వారం అని మంత్రి అప్పలరాజు అన్నారు. మంత్రిగా ఉన్నా ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు.
కాగా.. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు అంతా ప్రాంతీయవాదులని, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి తెలంగాణకు నాయకులు అయ్యారని మంత్రి అప్పలరాజు ఫైర్ అయ్యారు. ఏపీలో ప్రజాశాంతి పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. అంతేకాదు.. ఆంధ్రా ప్రజలకు తెలంగాణకు వెళ్లడం మానేస్తే అడుక్కు తినడం తప్ప అక్కడ ఏమీ ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి అప్పలరాజు. ఇలా మంత్రి అప్పలరాజు ఆవేశంలో చేసిన కామెంట్స్ రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీశాయి.