Srivani Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతిలోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు.

Srivani Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

Srivani darshan tickets

Updated On : November 30, 2022 / 2:07 PM IST

Srivani Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతిలోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తంగా పూజలు చేసి ప్రారంభించారు. గుంటూరుకు చెందిన ఎన్ లక్ష్మి హరీష్, జి.రూప సింధుకు జేఈవో తొలి టికెట్ అందించారు. ఈ సందర్భంగా వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇచ్చి రూ.500 చెల్లించే భక్తులకు ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్ లైన్ టికెట్లు జారీ చేస్తున్నారని చెప్పారు.

దాతలు ముందురోజు తిరుమలకు వెళ్ళి అవసరమైన పత్రాలు సమర్పించి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రక్రియలో దాతలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గుర్తించి టీటీడీ యాజమాన్యం శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్లు తిరుపతిలోనే జారీ చేసి అక్కడే వారికి వసతి గదులు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కు సమీపంలోని మాధవం గెస్ట్ హౌస్ నుంచి ఉదయాన్నే బయలు దేరి తిరుమలకు వెళ్ళవచ్చని సూచించారు.

TTD: శ్రీవారి బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు.. డిసెంబర్ 1నుంచి అమల్లోకి ..

శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే విరాళాలతో పురాతన ఆలయాల అభివృద్ధి, జీర్ణోద్ధరణ, కొత్తగా ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తున్నామని వీరబ్రహ్మం తెలిపారు. ఈ ట్రస్టు ద్వారా తొలివిడత లో తెలుగు రాష్ట్రాల్లో 502 ఆలయాలు నిర్మించామని చెప్పారు. రెండో విడతలో సుమారు 1500 ఆలయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే భక్తులు తిరుపతిలోని మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన కౌంటర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కౌంటర్ల నిర్వహణకు ముందుకొచ్చిన యూనియన్ బ్యాంకు యాజమాన్యానికి ఈ సందర్భంగా జేఈవో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ రాం ప్రసాద్, చీఫ్ మేనేజర్లు బ్రహ్మయ్య, నగేష్ కుమార్, విజివో మనోహర్, డిప్యూటీ ఈవో పార్వతి, ఈఈ కృష్ణారెడ్డి, ఏఈవో ధనుంజయులు పాల్గొన్నారు.