TDP – Janasena : ఇక దూకుడు పెంచుదాం..! నవంబర్ నుంచి జనంలోకి.. 10 హామీలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో

టీడీపీ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి అదనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నాలుగు హామీలను ప్రతిపాదించారు.

TDP – Janasena : ఇక దూకుడు పెంచుదాం..! నవంబర్ నుంచి జనంలోకి.. 10 హామీలతో ఉమ్మడి మినీ మేనిఫెస్టో

Pawan Kalyan and Nara Lokesh

Pawan Kalyan – Nara Lokesh: టీడీపీ, జనసేన పార్టీలు మరోసారి జట్టుకట్టబోతున్నాయి. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు.. రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకెళ్లి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఇరు పార్టీల జేఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ , నారా లోకేశ్ తో పాటు ఇరు పార్టీల ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఐక్యకార్యాచరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించారు. నవంబర్ 1 నుంచి రెండు పార్టీలు కలిసి ఇంటింటికి ప్రచారం ప్రారంభించేందుకు సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 3న విజయవాడలో రెండు పార్టీల రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం, ఈనెల 29 నుంచి 31వరకు జిల్లా స్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్నారు.

Also Read : Nara Bhuvaneshwari : ప్రజల్లోకి నారా భువనేశ్వరి.. ‘నిజం గెలవాలి’ పేరుతో బస్సు యాత్ర .. ఏఏ ప్రాంతాల్లో పర్యటిస్తారంటే..

టీడీపీ మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి అదనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో నాలుగు హామీలను ప్రతిపాదించారు. భవన నిర్మాణ కార్మికులు, యువత, రైతులు, సబ్ ప్లాన్ నూ చేర్చాలని పవన్ కోరడంతో.. టీడీపీ ఆరు హామీలు, జనసేన నాలుగు హామీలు మొత్తం పది హామీలతో బాబు ఫొటో – పవన్ ఫొటో ముద్రించిన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అయితే, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక తుది మెరుగులద్ది ఆపై పూర్తిస్థాయి ప్రణాళిక విడుదల చేసేందుకు సమావేశంలో నిర్ణయించారు. అన్ని అంశాల్ని జోడించి నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటించేందుకు తెలుగుదేశం – జనసేన పార్టీలు సిద్ధమయ్యాయి. అదే రోజు నుంచి రెండు పార్టీలు కలిసి జనంలోకి వెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి.

Also Read : Nara Bhuvaneswari : చంద్రబాబు లేకుండా తొలిసారి ఒంటరిగా.. నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్

ఇదిలాఉంటే.. సమావేశంకు ముందు పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ 15 నిమిషాల పాటు అంతరంగికంగా మాట్లాడుకున్నారు. వీరిమధ్య ఏవిధమైన చర్చలు జరిగాయనే అంశం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో జైలులో మిలాఖత్ సమయంలో ఆయన వెల్లడించిన పలు అంశాలపై లోకేశ్ పవన్ తో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో పవన్ కళ్యాణ్ టీడీపీ – జనసేన కూటమి విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయని చంద్రబాబుకు బెయిలివ్వకపోవడం బాధాకరమని, ఆయనకు మానసికంగా ధైర్యం ఇచ్చేందుకు, మద్దతు తెలిపేందుకే రాజమహేంద్రవరంలో, జైలుకు సమీపంలో జేఏసీ సమావేశం నిర్వహించామని పవన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమి విజయం సాధించాక ఇదే రాజమహేంద్రవరంలో భారీ సభ ఏర్పాటు చేస్తామని పవన్ తెలిపారు.