రాజకీయాలకు జగన్ పనికిరారు, వైసీపీని ఇంటికి పంపాలి ఏపీని కాపాడుకోవాలి- చంద్రబాబు

నా కోసం వంద రోజులు కష్టపడండి. సైకిల్ ఎక్కి రోడ్లపై తిరగండి. మీ జీవిత బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను ఇస్తా.

రాజకీయాలకు జగన్ పనికిరారు, వైసీపీని ఇంటికి పంపాలి ఏపీని కాపాడుకోవాలి- చంద్రబాబు

Chandrababu Naidu

Updated On : January 5, 2024 / 11:09 PM IST

Chandrababu Naidu :  ప్రకాశం జిల్లా కనిగిరి సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రజలు ఐదేళ్లు నరకాన్ని అనుభవించారని చంద్రబాబు వాపోయారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు అన్నీ మంచి జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీకీ పూర్వ వైభవం రావాలంటే పవన్ కళ్యాణ్ నేనే కాదు మీరంతా కూడా నడుంబిగించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా నుండే ఎన్నికల శంఖారావం మోగించాను అని చెప్పారు. గెలాక్సీ గ్రానైట్ ను పూర్తిగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి అమ్ముకోవాలని చూస్తే దాన్ని అడ్డుకుని కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని అన్నారు చంద్రబాబు.

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు చంద్రబాబు. ఎమ్మెల్యేలకు బదిలీలు ఉంటాయని నేను ఎప్పుడూ చూడలేదు, కనీసం వినలేదు అని ఎద్దేవా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ కావాలంటే నన్ను తిట్టాలని జగన్ అంటున్నారు, ఇదెక్కడి విడ్డూరం అని చంద్రబాబు అన్నారు. నన్ను బూతులు తిడితే మీరు పెద్ద నాయకులు అవుతారా? అని చంద్రబాబు నిలదీశారు. అసెంబ్లీలో నా భార్యను తిట్టినప్పుడు చాలా బాధపడ్డాను అని చంద్రబాబు వాపోయారు. జగన్ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. ఏపీ ప్రజలందరం జగన్ బాధితులమే అన్నారు చంద్రబాబు. ఏపీని కాపాడుకోవడం నాది, పవన్ దే కాదు.. మనందరి బాధ్యత అని చంద్రబాబు అన్నారు.

Also Read : వైసీపీకి బిగ్ షాక్.. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రాజీనామా, ఇండిపెండెంట్‌గా పోటీ

”ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి తమ హయాంలో ఏం చేశామో చెప్పుకునే దైర్యం ఉండాలి. కానీ ఈ ప్రభుత్వ హయాంలో మీ ప్రాంతానికి ఏమైనా అబివృద్ధి జరిగిందా? అభివృద్ది చేయడం ద్వారా సంపద సృష్టించవచ్చు. ఆ సంపద ద్వారా ప్రజలకు ఖర్చు పెట్టవచ్చు. రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రాలేదు, ఒక్క ఉద్యోగం రాలేదు. దేశంలోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని ఓ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. ఒక్క చాన్స్ మాయలో ఏపీ ప్రజలు పడి మోసపోయారు. ఇదే విషయం ఇప్పుడే తనతో కలిసిన ఉద్యోగులు తెలిపారు. ఒక్క చాన్స్ అని నమ్మి మోసపోయామని ఉద్యోగులు చెబుతున్నారు.

ఒక కుటుంబంలో వ్యక్తి చెడ్డవాడైతే ఆ కుటుంబం అంతా చెడిపోతుంది. టీడీపీ హయాంలో యువతకు ఉద్యోగాలు తెస్తే నేడు సీఎం జగన్ గంజాయి ఇచ్చాడు. నా హయాంలో ఇండస్ట్రీలు తెస్తే జగన్ ఏపీకి టెర్రరిజాన్ని తెచ్చాడు. సమర్దవంతమైన నాయకత్వం ఉంటే విద్యుత్ పన్నులు తగ్గించవచ్చు. నేను రాజధాని కట్టేందుకు రోడ్లకు మన్ను తోలితే నేడు ఆదే మన్నును తవ్వుకుని అక్రమంగా అమ్ముకుని దోచుకుంటున్న దొంగలుగా మారారు.

రాష్ట్రాన్ని అభివృద్ది చేసి పూర్వ వైభవం తేవడానికి సంకల్పం, అనుభవం నాకుంది. రాష్ట్రమంతా కుంభకోణాలమయంగా మారింది. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో నాణ్యమైన మద్యాన్ని అమల్లోకి తెస్తాం. రాష్ట్రంలో నియంత పోకడలు, అహంభావం నడుస్తోంది. ప్రశ్నించిన వారిపై ఎదురు నిలిచిన వారిపై అక్రమ కేసులు ఫెడుతున్నారు. ఓడిపోతున్నామనే భయం జగన్ కు కళ్లు ముందు కనపడుతోంది. అందుకే ఎమ్మెల్యే, ఎంపీలను బదిలీల పోగ్రాం పెట్టి ట్రాన్స్ ఫర్లు చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఉన్న చెత్తను పక్కింట్లో వేస్తాడట.

Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

కనిగిరిలో ప్రతి పనిలో వసూళ్లు చేసే ఎమ్మెల్యే బొర్ర మధుసూదన్ యాదవ్, బట్టలు విప్పదీసే మంత్రి సురేశ్ ను ప్రజలు తంతే యర్రగొండపాలెంలో పడ్డాడు. మార్కాపురం ఎమ్మెల్యే భూములను కబ్జా చేస్తున్నాడు. నీ ఎమ్మెల్యేలతో కబ్జాలు చేయించి పర్సెంటేజీలు తీసుకుని ఇప్పుడు వారిని ఇతర ప్రాంతాలకు మారుస్తున్నావంటే తప్పు ఎవరు చేశారు జగన్? నా కుటుంబాన్ని, పవన్ కల్యాణ్ ను తిడితేనే ఎమ్మెల్యే సీటు ఖాయమనే పరిస్థితిని వైసీపీ తెచ్చింది. సీటు లేకపోయినా పర్వాలేదు కానీ ఆ పని మేము చేయమని తెగేసి చెప్పిన కొందరు వైసీపీ నాయకుల నిర్ణయాన్ని నేను అభినందిస్తున్నాను. నాపై అలిపిరిలో బాంబు బ్లాస్టింగ్ జరిగినా పెద్దగా బాధ పడలేదు. కానీ నా సతీమణిని నిండుసభలో అవమానం చేశారు. ఆరోజు ఎప్పుడూ లేనంత బాధ పడ్డాను. అందుకే కౌరవుల సభను గౌరవ సభగా మారుస్తాను.

యువత నా కోసం వంద రోజులు కష్టపడండి. సైకిల్ ఎక్కి రోడ్లపై తిరగండి. మీ జీవిత బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను ఇస్తా. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తెస్తా. వెలిగొండకు నేనే శ్రీకారం చుట్టా. నా హయాంలో 90శాతం పూర్తి చేసిన ప్రాజెక్టుకు ప్రభుత్వం మారగానే కాంట్రాక్టర్ ను మార్చి ప్రాజెక్టును నేటికీ పూర్తి చేయలేకపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండ పూర్తి చేసి నీరు అందిస్తాం. దళితుడిని చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వైసీపీ నేతను డఫ్పులతో ఊరేగింపు చేసి తీసుకెళ్లారంటే దళితులకు ఈ ప్రభుత్వం ఎటువంటి రక్షణ కల్పిస్తుందో మీరు అర్దం చేసుకోండి.

టీడీపీ అదికారంలోకి వచ్చిన వెంటనే త్రిపుల్ ఐటీ, నిమ్జ్ వంటి ప్రాజెక్టులను నిర్మిస్తాం. నేను వేసిన ఫౌండేషన్ రాళ్లను ఈ ప్రభుత్వం తొలగించవచ్చేమో కానీ ప్రజల మనసులోంచి తొలగించలేరు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టును టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ పరుగులు పెట్టిస్తాం. ప్రభుత్వం చేష్టలతో నడికుడి శ్రీకాళహస్తి ప్రాజెక్టు ముందుకు పోవడం లేదు. వైసీపీ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన భూ చట్టం అమల్లోకి వచ్చిందంటే మాత్రం మీ భూములు మీ చేతుల్లో ఉండవు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ లోపభూయిష్ట చట్టాన్ని రద్దు చేస్తాం. వైసీపీ చేసిన భూకబ్జాలపై సిట్ తో విచారణ చేసి భూములు కోల్పోయిన బాధితులకు ఆ భూములను తిరిగి ఇస్తాం.

స్వర్ణయుగం రావాలంటే రాతియుగం పోవాలి. అటువంటి స్వర్ణయుగం రావాలంటే సైకో పోవాలి సైకిల్ రావాలి. అందుకు ప్రజలంతా సహకరించాలి. వివేకానంద రెడ్డిని చంపి ఆ హత్యను టీడీ పై వేసి నేను దిక్కులేని బిడ్డననీ అప్పట్లో ప్రజలను నమ్మించి మభ్యపెట్టారు. ఆనాడు కోడికత్తితో పొడిచి డ్రామా ఆడిన శ్రీను జైల్లోనే ఉన్నాడు. తండ్రిని చంపిన వారిపై కేసు పెట్టిన చెల్లెలిపై తిరిగి కేసులు పెట్టారు. అన్ని తప్పులు అతనే చేసి ఇతరులపై బురదజల్లె మనస్తత్వం జగన్ ది. నా నియోజకవర్గంలో కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నా. దీని ద్వారా సమర్దవంతమైన నాయకత్వం వస్తుంది. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం తెలుగు జాతి కోసం సమర్ధవంతమైన పాలన కోసం దళితుల అభివృద్ది కోసం రా కదలి రా అని ఏపీ ప్రజలకు కనిగిరి వేదికపై నుండి పిలుపునిస్తున్నా.

Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్

ప్రజల్లో చైతన్యం ద్వార గ్రామాలన్నీ ఏకం కావాలి. జగన్ రాజకీయాలకు పనికి రారు. రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు అంతా నడుం బిగించాలని కోరుతున్నా. జగన్ రాష్ట్రానికి పట్టిన అరిష్టం” అని నిప్పులు చెరిగారు చంద్రబాబు.