శ్రీశైలం ఎమ్మెల్యే తీరుపై అధిష్ఠానం ఆరా.. నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన నేతల మీద దాడిపై సీరియస్
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాటల యుద్ధంపై హీట్ కొనసాగుతుండగానే..సొంత పార్టీ నేతల టూర్‌ను తన అనుచరుల చేత అడ్డుకుని ఇంకో రచ్చ చేశారు బుడ్డా రాజశేఖర్.

నంద్యాల జిల్లా శ్రీశైలం పాలిటిక్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఓ వైపు తన రాజకీయ ప్రత్యర్థి..వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డితో బస్తీమే సవాల్ అంటూ తొడగొడుతున్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్..మరోవైపు సొంత పార్టీ నేతల టూర్‌ను తన అనుచరుల చేత అడ్డుకోవడం రచ్చకు దారి తీసింది. శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి రావడం..బుడ్డా రాజశేఖర్‌కు కోపం తెప్పించిందట.
తనకు సమాచారం ఇవ్వకుండా తన నియోజకవర్గానికి ఎలా వస్తారంటూ కుంపటి రాజేశారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్. ఎంపీ బైరెడ్డి శబరి వెంట మాజీ మంత్రి ప్రతాప్‌రెడ్డి పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు..ఏరాసు ప్రతాప్‌రెడ్డి ఇంట్లోకి ఎమ్మెల్యే చొరబడే ప్రయత్నం చేశారు. ఏరాసు ప్రతాప్‌రెడ్డిపై దాడి కూడా చేశారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి అనుచరులు.
అయితే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి తీరుపై టీడీపీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు మాజీమంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి. ఇంచార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనే బుడ్డా రాజశేఖర్ తీరుపై పార్టీ పెద్దలు సీరియస్ అయ్యారని..అయినా ఆయన తీరు మారడం లేదంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఎంపీ బైరెడ్డి శబరి పర్యటనపై మూడు రోజులుగా ఎమ్మెల్యేకు చెబుతూనే ఉన్నామని..సమాచారం ఇవ్వకుండా వచ్చారనడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఏరాసు ప్రతాప్‌రెడ్డి.
లోకల్‌గా మంచి పేరు
తన సొంత నియోజకవర్గం, ఆత్మకూరులో తనకు ఇల్లు కూడా ఉంది..అక్కడ పర్యటించొద్దనడం ఏంటో అర్థం కావడం లేదంటూ మండిపడ్డారు. అయితే ఏరాసుది శ్రీశైలం నియోజకవర్గమే. ఆయనకు లోకల్‌గా మంచి పేరుండటంతో..ఏరాసు యాక్టీవ్ అయితే తన సీటుకు ఎసరు వస్తుందేమోనన్న ఆందోళన, అభద్రతా భావంలో బుడ్డా రాజశేఖర్ ఉన్నారట. అందుకే ఎంపీ వెంట ఏరాసు పర్యటించడాన్ని బుడ్డా వ్యతిరేకిస్తున్నారట. ఈక్రమంలోనే తన అనుచరులతో దాడి చేయించారన్న టాక్ వినిపిస్తోంది.
ఈ ఇష్యూ కంటే ముందే శ్రీశైలంలో రాజకీయం హీటెక్కింది. అభివృద్ధిపై ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, కూటమి ప్రభుత్వం వచ్చాక తాను చేసిన డెవలప్‌మెంట్‌పై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. శిల్పా చక్రపాణిరెడ్డి కూడా సై అన్నారు. ఈ క్రమంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు, వ్యక్తిగత విమర్శలకు వరకు వెళ్లింది ఆ ఇద్దరి వ్యవహారం.
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాటల యుద్ధంపై హీట్ కొనసాగుతుండగానే..సొంత పార్టీ నేతల టూర్‌ను తన అనుచరుల చేత అడ్డుకుని ఇంకో రచ్చ చేశారు బుడ్డా రాజశేఖర్. అయితే ప్రత్యర్థితో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నా..సొంత పార్టీ నేతల పట్ట ఆయన వ్యవహరించిన తీరే విమర్శలకు దారితీసింది. అయితే టీడీపీ అధిష్టానం గతంలోనే ఆయనను మందలించిందంటున్నారు. లేటెస్ట్ ఇష్యూతో మరోసారి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ తప్పదని చర్చించుకుంటున్నారు టీడీపీ నేతలు. శ్రీశైలం నియోజకవర్గ రాజకీయ రచ్చ ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.