పాడెపై మోసుకెళ్తుండగా లేచి కూర్చున్న వ్యక్తి

పాడెపై మోసుకెళ్తుండగా లేచి కూర్చున్న వ్యక్తి

Updated On : December 22, 2020 / 10:35 PM IST

man sat up while carrying on the hearse : చిత్తూరు జిల్లాలో విచిత్రం జరిగింది. చనిపోయాడని పాడెపై తీసుకెళుతున్న వ్యక్తి లేచి కూర్చున్నాడు. ఈ సంఘటన మదనపల్లె మండలంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, వీఆర్వో తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని వ్యక్తి మండలంలోని కట్టుబావి గ్రామంలో చెట్టు కింద రెండు రోజులుగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.

గ్రామస్తులు గ్రామ కార్యదర్శి మనోహర్, వీఆర్వో నాగరాజుకు సమాచారం ఇచ్చారు. అధికారులు అక్కడికి చేరుకుని అతడిని పరిశీలించి చనిపోయాడని భావించారు. ఊరికి సమీపంలో గుంతను తవ్వించి, పాడెపై అతన్ని మోసుకెళుతుండగా ఒక్క సారిగా లేచి కూర్చున్నాడు.

వెంటనే అతడిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా కోలుకున్నాడు. అయితే అతని వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.