ఏకాంతంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

tirumala srivari Navaratri Brahmotsavam : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల విడుదల చేసిన కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబరు 16 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్దానం నిర్ణయించింది.
పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల వాహన సేవలను ఆలయ మాడ వీధుల్లో నిర్వహించాలని అక్టోబరు 1న టిటిడి ప్రకటించింది. అయితే, అక్టోబరు 6న కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నూతన నిబంధనలు విడుదల చేసింది. ఈ మేరకు 200 మందికి మించకుండా మాత్రమే మతపరమైన, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని సూచనల్లో పేర్కొంది.
అదేవిధంగా, అక్టోబరు నుంచి డిసెంబరు వరకు శీతాకాలంలో ప్రముఖ ఉత్సవాలు ఉన్న నేపథ్యంలో భక్తులు గుమికూడే అవకాశం ఎక్కువగా ఉన్నందున, కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడరాదని కోరింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల మేరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయం వెలుపల నిర్వహించాలనే నిర్ణయాన్ని టిటిడి పునఃసమీక్షించింది. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఆ మేరకు ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయం తీసుకుంది.
ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో వాహనసేవలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలన్నీ యథాతథంగా నిర్వహిస్తారు. భక్తుల కోసం వాహనసేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.