ఏపీలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య.. ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్.. తీవ్రంగా స్పందించిన నారా లోకేష్
అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని ఎన్‌సీసీ నగర్ లో దారుణం చోటు చేసుకుంది.

Anantapur: అనంతపురంలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని తన్మయి దారుణ హత్యకు గురైంది. ముళ్ల పొదల్లో ఆమె శవమై కనిపించింది. ఆమె తలపై బలమైన గాయం ఉంది. ఘటనా స్థలంలో బీరు బాటిల్ లభ్యమైంది. దీంతో దుండగులు బీరు బాటిల్ తో కొట్టి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనంతపురంలోని రామకృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న తన్మయి ఇంటర్ పూర్తి చేసింది. ఈ నెల 3న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యువతి మృతితో ఆమె తల్లిదండ్రులు లక్ష్మీపతి, అరుణలు కన్నీరుమున్నీరవుతున్నారు. అమ్మాయి కనపించడం లేదని ఐదు రోజుల క్రితమే ఫిర్యాదు చేశామని, అయినా పోలీసులు పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తన్మయి దారుణ హత్యపై పోలీసులు వేగవంతం చేశారు. సీసీటీవీ పుటేజీలు, తన్మయి కాల్‌డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
యువతి దారుణ హత్యపై హోంమంత్రి అనిత స్పందించారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన ఆమె.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తన్మయి హత్య ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘‘అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం షాక్ కు గురిచేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు. ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం.’’ అని లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
మహిళలు, బాలికలకు భద్రత కరువు: వైఎస్ జగన్
యువతి హత్యపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకె తన్మయిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈనెల జూన్ 3న తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఆ అమ్మాయిని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఆరు రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లె సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగ వైఫల్యమే. తమ అమ్మాయి కనిపించడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏంచేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలి’’ అంటూ జగన్ అన్నారు.