Vasantha Krishna Prasad: అందుకే వైసీపీని వీడాను.. ఇకపై నేను..: వసంత కృష్ణ ప్రసాద్
తనకు అధిష్ఠానం నుంచి సీటు ఇస్తామని పిలుపువచ్చిందని.. కానీ తన మనసు విరిగిపోయిందని..

Vasantha Krishna Prasad
Vasantha Krishna Prasad: ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. 10 టీవీతో ఆయన మాట్లాడుతూ వివరాలు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నా కానీ కార్యకర్తల ఒత్తిడి మేరకు మళ్లీ పోటీ చేయాలని అనుకుంటున్నానని చెప్పారు.
టచ్‍లో లేను
తాను టీడీపీతో టచ్‍లో ఉండి వైసీపీని వీడానని ప్రచారం చేస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. అది అబద్ధమని చెప్పారు. తాను ఏ పార్టీతోనూ టచ్‌లో లేనని తెలిపారు. తనకు అన్ని పార్టీలనుంచి పిలుపువచ్చిందని చెప్పారు. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. పోటీ మైలవరం నుంచి లేక పెనమలూరు నుంచా అనేది కూడా త్వరలోనే చెబుతానని అన్నారు.
తనకు వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే అమితమైన ప్రేమ అని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. వైఎస్ఆర్ ఎప్పుడూ ఇంత ఘోరంగా చేయలేదని అన్నారు. జగన్‌తో కలిసి నడిచినప్పుడు వైఎస్ ఆశయాలతో నడుస్తారని అనుకున్నానని తెలిపారు. పెడన వెళ్లిన నాయకుడు తనను ఇబ్బందులు పెట్టారని చెప్పారు.
సీఎం జగన్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. మంత్రి జోగి రమేశ్ తన నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించారన్నారు. తన నియోజకవర్గంలో సంపద కోసం గ్రూపు రాజకీయాలు చేశారని చెప్పారు. అన్ని విషయాలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా జోగి రమేశ్‌నే వెనకేసుకురావడం బాధ అనిపించిందని చెప్పారు.
మనసు విరిగిపోయింది
జోగి రమేశ్ ను నియంత్రించలేదు కాబట్టే జగన్ పై తనకు కోపమన్నారు. తన వెనుక గోతులు తవ్వుతూ తన ప్రత్యర్థి ఉమాతో తన పార్టీ వారే చేతులు కలిపారని వసంత కృష్ణ ప్రసాద్ చెప్పారు. తనకు అధిష్ఠానం నుంచి సీటు ఇస్తామని పిలుపువచ్చిందని.. కానీ తన మనసు విరిగిపోయిందని, అందుకే సీటు వద్దని చెప్పానని తెలిపారు.
ఇప్పుడు వైపీసీని వీడుతున్నానన్నారు. దేవినేని ఉమా తనపై చేసిన విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. తనపైన ఆధారాలు లేని ఆరోపణలు ఉమా చేస్తూనే ఉంటారని అన్నారు.
Chandrababu Naidu: జగన్ మళ్లీ జైలుకి వెళ్తే ఏమవుతుందో తెలుసా?: చంద్రబాబు