పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్లే వాళ్లు ఎగ్జామ్ మిస్ అయ్యారా?.. విశాఖ సీపీ క్లారిటీ

సీసీ ఫుటేజ్‌, ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల సెల్‌ఫోన్లను ట్రాక్‌ చేశామన్నారు.

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్లే వాళ్లు ఎగ్జామ్ మిస్ అయ్యారా?.. విశాఖ సీపీ క్లారిటీ

Updated On : April 9, 2025 / 12:39 PM IST

Pawan Kalyan Convoy : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ కారణంగా తాము సకాలంలో ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోలేకపోయామని, జేఈఈ (మెయిన్‌) ఎగ్జామ్ కు హాజరు కాలేకపోయామని పెందుర్తిలో కొందరు విద్యార్థులు చేసిన ఆరోపణలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై దుమారం రేగింది. పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. తన కాన్వాయ్‌ కారణంగా విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరవలేకపోయారనే వార్తలపై విచారణ చేపట్టాలని, అసలేం జరిగిందో తెలుసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.

తన కాన్వాయ్‌ ఎంత సేపు కోసం ట్రాఫిక్‌ ను నిలిపారు? ఎగ్జామ్ సెంటర్ కు విద్యార్థులు వెళ్లే సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌ పరిస్థితేంటి? సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్‌ను నియంత్రించారా? వంటి అంశాలపై విచారించి నివేదిక ఇవ్వాల్సిందిగా విశాఖ పోలీసులను ఆదేశించారు పవన్.

పవన్ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ జరిపారు. ఈ వ్యవహారంపై విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ స్పందించారు. అసలేం జరిగిందో అనే వివరాలను ఆయన వెల్లడించారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ కారణంగా జేఈఈ (మెయిన్) ఎగ్జామ్ కు హాజరుకాలేకపోయినట్లు పెందుర్తికి చెందిన కొందరు విద్యార్థులు చేసిన ఆరోపణలను సీపీ ఖండించారు. విద్యార్థుల ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. పవన్‌ కాన్వాయ్‌ వల్ల విద్యార్థులకు ఆలస్యమైందనడం అవాస్తవమన్నారాయన. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

Also Read : బాధేసింది.. బ్రాంకో స్కోపీ చేస్తున్నారు.. కొడుకు మార్క్ శంకర్ ప్రమాదంపై పవన్ ఎమోషనల్..

విద్యార్థులే ఆలస్యంగా వచ్చి పోలీసులపై నిందలు వేస్తున్నారని చెప్పారు. సీసీ ఫుటేజ్‌, ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల సెల్‌ఫోన్లను ట్రాక్‌ చేశామన్నారు. పోలీసుల వల్ల విద్యార్థులకు ఎక్కడా ఇబ్బంది కలగలేదని తేల్చి చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్లాకే డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ వెళ్లిందని వివరణ ఇచ్చారు సీపీ బాగ్చీ.

Also Read : ఏపీలో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి- కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్

సోమవారం ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పవన్ పర్యటించారు. అయితే పవన్ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి పెందుర్తి అయాన్ డిజిటల్‌లో జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు రాయలేకపోయారని కొందరు విద్యార్థులు వాపోయారు.