TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?

పవన్ క్లారిటీతో ఇప్పుడు బీజేపీ వైఖరిపై ఆసక్తి రేకెత్తుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదన మూడేళ్లుగా ఉంది.

TDP- Janasena: జనసేన, టీడీపీ పొత్తు.. ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి?

what changes in andhra pradesh politics after tdp janasena alliance

TDP- Janasena Alliance: ఊగిసలాటకు తెరపడింది.. ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది. టీడీపీతో కలిసి నడుస్తామంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) క్లారిటీ ఇచ్చేశారు. ఇక తేల్చుకోవాల్సింది బీజేపీయే.. చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) తర్వాత పూర్తి నైరాశ్యంలో చిక్కుకున్న తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party) పవన్ ప్రకటన బిగ్ రిలీఫ్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌. జనసేనాని పవన్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో జరిగే మార్పులేంటి? టీడీపీ, జనసేన మధ్య ఉమ్మడి కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?

చంద్రబాబు అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. మూడేళ్లుగా పొత్తు ప్రతిపాదనల్లో ఉన్న టీడీపీ, జనసేన ఓ క్లారిటీకి వచ్చేశాయి. ఆరు నూరైనా.. నూరు ఆరైనా కలిసేవుంటామని తేల్చిచెప్పేశాయి. అంతేకాదు ఉమ్మడి కార్యాచరణతో ప్రభుత్వంపై పోరాడనున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఏకపక్షంగా టీడీపీతో కలిసినడుస్తామని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. చంద్రబాబు అరెస్టు తర్వాత తీవ్రంగా స్పందించిన పవన్.. అంతే స్పీడ్‌గా పొత్తుపైనా నిర్ణయం తీసేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌డీఏకి ఏకైక భాగస్వామిగా ఉన్న జనసేన.. ఆ స్నేహాన్ని పక్కన పెడుతుందా? లేక టీడీపీని ఎన్‌డీఏ భాగస్వామి చేసేలా అడుగులు వేస్తుందా? అన్నదే తేలాల్సివుంది.

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పోరాడుతున్నాయి. రెండు పార్టీల మధ్య ఇన్నాళ్లు అవగాహన రాజకీయమే నడిచింది కానీ, ఇంతవరకు పొత్తు ప్రకటన విడుదల కాలేదు. పొత్తు పెట్టుకుంటామని ఇరు పార్టీలు చెబుతున్నా.. తమతో బీజేపీ కూడా కలిసి రావాలని కోరుతున్నాయి. 2019 ఎన్నికల అనంతరం పవన్‌ పార్టీ బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో జనసేన భాగస్వామి. కానీ, బీజేపీ, టీడీపీ మధ్య గత ఎన్నికలకు ఏడాది ముందు గ్యాప్ ఏర్పడింది. అదికూడా పవన్ చెబుతున్న ప్రత్యేక హోదా విషయంలోనే.. 2014 ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగిన టీడీపీ మధ్యలోనే బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. 2019 ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఇంతవరకు ఇరుపార్టీల మధ్య సంబంధాలు మళ్లీ పునరుద్ధరణ కాలేదు.

Also Read: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

ఇదే సమయంలో బీజేపీ పెద్దలు ఏపీలో పవన్‌ను ప్రోత్సహించేలా పావులు కదిపారు. జనసేనానితో స్నేహం కొనసాగించారు. కానీ, రాష్ట్రస్థాయిలో జనసేన చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలకు ఎప్పుడూ కలిసిరాలేదు బీజేపీ. పవన్‌తో కేంద్ర బీజేపీ పెద్దలు సన్నిహితంగా ఉంటున్నా.. రాష్ట్రంలోని కమలం నేతలు అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేక అజెండాతో టీడీపీతో అవగాహన పెంచుకుంటూ వచ్చారు పవన్‌కల్యాణ్. ఇరుపార్టీలపై రాష్ట్ర ప్రభుత్వం అణిచివేత ధోరణి అవలంబిస్తోందంటూ తరచూ సంయుక్త ప్రకటనలు చేసేవారు చంద్రబాబు, పవన్. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్.. పవన్‌కు నష్టం జరిగితే బాబు.. ఒకరికొకరు స్నేహ సహకారం అందించుకుంటూ ఇన్నాళ్లు ముందుకు కదిలారు. కానీ, పొత్తులపై అస్పష్టంగానే వ్యవహరించేవారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయనంటూనే పవన్.. పొత్తులపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడేవారు.. కానీ చంద్రబాబు అరెస్టు తర్వాత ఇక ఆలస్యం చేయకూడదనుకున్నారేమో పవన్ ఫుల్ క్లారిటీతో ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఏదిఏమైనా టీడీపీతో కలిసే నడుస్తామన్నదే విస్పష్టంగా ప్రకటించేశారు.

Also Read: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగబోతోంది?

పవన్ క్లారిటీతో ఇప్పుడు బీజేపీ వైఖరిపై ఆసక్తి రేకెత్తుతోంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదన మూడేళ్లుగా ఉంది. జనసేన, టీడీపీ ఈ విషయంపై బహిరంగంగా ప్రకటనలు చేసినా.. బీజేపీ ఎప్పుడూ ఈ ప్రస్తావన తేలేదు. కనీసం రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించలేదు. రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని దెబ్బతీయాంటే మూడు పార్టీలు చేతులు కలపాల్సిందే అంటూ పదేపదే కోరుతున్నా బీజేపీ నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. టీడీపీ-జనసేన పొత్తుపై కూడా ఈ విషయంలోనే అనుమానాలు ఉండేవి.

Also Read: మోదీ, అమిత్ షాలతో మాట్లాడి చంద్రబాబును విడిపించొచ్చు కదా- పవన్ కల్యాణ్‌కు మంత్రి రోజా సలహా

బీజేపీ ఏ విషయం తేల్చనందున బీజేపీని కాదని పవన్ టీడీపీతో కలిసివెళ్తారా? అన్న డౌట్ వచ్చేది. ఐతే ఇప్పుడు పవన్ ఏ శషబిషలు లేకుండా తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో కలిసివెళతామన్నారు. ఎన్నికలు ఒక్కటే కాదు.. రాష్ట్ర శ్రేయస్సు కోసం కలవకతప్పదన్నట్లు.. టీడీపీ, జనసేన పొత్తు రాష్ట్రప్రజలు అవసరమన్నట్లు పొలిటికల్ టచ్ ఇచ్చారు పవన్.. బీజేపీని రమ్మంటూ పిలుస్తూనే జనసేన, టీడీపీ కలిసి నడుస్తాయని తేల్చిచెప్పాశారు. ఈ పరిణామం ఇటు టీడీపీకి అటు జనసేనకి హుషారు తెచ్చింది. బాబు అరెస్టుతో డీలాపడిన టీడీపీ కార్యకర్తలు ఓ విధంగా సంబరాలు చేసుకున్నారు. పవన్ రూపంలో తమకు పెద్ద అండ దొరికిందని ఊపిరి పీల్చుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎవరూ ఊహించని విధంగా ములాఖత్‌కు వచ్చిన పవన్.. పొత్తులపై విస్పష్ట ప్రకటన చేయడమే హాట్‌టాపిక్.