జనసేనాని యూ టర్న్? వ్యూహాం ఏంటో?

ఏపీలో మూడు రాజధానుల విషయంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తోంది. అసెంబ్లీలో జగన్ ఈ ప్రకటన చేయగానే ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించిన పవన్.. ఇప్పుడు మాత్రం ఆచితూచి అడుగేయాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు స్పందించకుండా ఉండడమే బెటర్ అనుకుంటున్నారని జనాలు అంటున్నారు.
ఒక్క రోజు వ్యవధిలోనే ఆయన మాట తీరును గమనించిన వారు కూడా ఇదే చెబుతున్నారు. జగన్ ప్రకటించగానే తినడానికి మెతుకుల్లేక తండ్రి ఏడుస్తుంటే కొడుకొచ్చి పరమాన్నం కావాలన్నాడంట.. అంటూ పాత సామెతతో రాజధాని వ్యవహారంపై విమర్శలు సంధించిన జనసేనాని ఇప్పుడు వెనక్కి తగ్గారని అంటున్నారు.
ఏపీ సీఎం జగన్ ప్రకటన తర్వాత రాష్ట్రంలో వస్తున్న స్పందన చూశారో ఏమో గానీ.. ఒక రోజంతా సైలెంట్‌గా ఉన్న పవన్ కల్యాణ్.. ఓ కొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు. రాజధాని తరలిపోతోందని రైతులంతా ఆందోళనతో ఉన్నట్టు బిల్డప్ ఇవ్వడం స్టార్ట్ చేశారట.
రాజధాని ప్రాంత రైతులను సముదాయించడానికి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ వేశామని, ఈ నెల 20న ఆ కమిటీ పర్యటించి ఓ నివేదిక ఇస్తుందని పవన్ ట్వీట్ చేశారు. పనిలో పనిగా సీఎం జగన్ ఏర్పాటు చేసిన కమిటీ తమ పని పూర్తి చేసి, నివేదిక ఇచ్చే వరకు ఎవరూ ఆవేశపడొద్దని కూడా సూచించారు. దయచేసి వేచి ఉండండి అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్.
పవన్ కామెంట్స్‌పై ట్రోలింగ్ :
ఇప్పటికే రాజధాని విషయంలో పవన్ చాలా తొందరపడ్డారని జనాలు అంటున్నారు. అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేసిన వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యే కంటే కాస్తా పర్యవసనాలు పరిశీలించిన తర్వాత స్పందించి ఉంటే బావుండేదని అంటున్నారు. రాజధానిని నాశనం చేస్తున్నారని, ఉత్తరాంధ్ర, రాయలసీమలో వైసీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకే ఈ పన్నాగం పన్నారనే అర్థం వచ్చేలా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అయితే అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అన్నట్టుగా పవన్ కామెంట్స్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. అదే సమయంలో రాజధానుల ప్రకటన విషయంలో చంద్రబాబు కూడా మరీ దూకుడుగా వ్యవహరించకపోవడంతో పవన్ ఆలోచనలో పడ్డారట. సాయంత్రానికి తేరుకుని కొత్త స్టేట్‌మెంట్‌తో జనం ముందుకొచ్చారని చెబుతున్నారు.
వేచి చూద్దాం.. పవన్ కొత్త రాగం :
వైసీపీ ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దామంటూ పవన్ కొత్త రాగాన్ని అందుకున్నారని జనం అనుకుంటున్నారు. అందులో పొందుపరిచిన నిర్ణయాలను బట్టి స్పందిద్దామంటూ శాంతి వచనాలు పలుకుతున్నారు.
24 గంటలు గడవక ముందే పవన్‌లో వచ్చిన ఈ మార్పు చూసి జనసేన కేడర్ ముక్కున వేలేసుకొని ఇదేంటి ఇట్టా యూ టర్న్ తీసుకున్నారని అనుకుంటున్నారు. బహుశా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబులా పవన్ కూడా యూ-టర్న్ తీసుకోవడం అలవాటు చేసుకున్నారా లేక, తాను తొందర పడ్డానని తెలుసుకున్నారా? అనే డిస్కషన్ జనాల్లో మొదలైంది.