ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

YV Subba Reddy Sensational Comments on AP Capital

Updated On : February 13, 2024 / 3:51 PM IST

YV Subba Reddy on AP Capital : ఏపీ రాజధానిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానిగా వచ్చేంత వరకు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధానిగా కొనసాగితే బాగుంటుందని అన్నారు. గత ప్రభుత్వంకూడా అమరావతిలో తాత్కాలిక రాజధానినే నిర్మించారని, రాజధాని నిర్మించే స్థోమత ప్రస్తుతం ఏపీలో లేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖను పరిపాలన రాజధానిగా అనుకున్నాం.. కానీ, దానిపై న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడుతాయో తెలియదు.. ఎన్నికల తర్వాత జగన్ మోహన్ రెడ్డి దానిపై వివరణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. విశాఖ రాజధాని అయ్యేంత వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలని నా భావన అని సుబ్బారెడ్డి అన్నారు.

Also Read : నా గురించి మాట్లాడే అర్హత లేదు.. అనిల్ కుమార్ యాదవ్‌కు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కౌంటర్

ఎన్నికల ముందు నుంచే విశాఖపట్టణం రాజధానిగా పాలన చెయ్యడానికి సిద్ధం ఉన్నాం.. కానీ, న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆ పని సాధ్యం కాలేదు. సీఎం జగన్ వచ్చి పరిపాలన చెయ్యాలంటే ఇక్కడి నుంచి చేస్తారు. కానీ, ఇక్కడ ఉద్యోగులు గురించి ఆలోచించాలి. ఈరోజుకీ హైదరాబాద్ నుంచే ఉద్యోగులు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మనకంటూ ఓ రాజధాని లేదు.. విశాఖ రాజధానిగా న్యాయపరమైన చిక్కులు లేకుండా పరిపాలన సాగించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం వైఫల్యం కారణంగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు.

ఒక్కరోజులో విశాఖను రాజధానిగా తరలించలేము.. సీఎం ఒక్కడే ఉంటే సరిపోదు.. దానికి సంబంధించి సీఎంతో పాటు ఉద్యోగులు, అధికారులు రావాలి. వారికి సౌకర్యాలు కల్పించాలి. అందుకే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండాలని కోరుతున్నాము. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమే.. వచ్చే చట్టసభల్లో దీనిపై పోరాటం చేస్తామని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.