YS Sharmila: చంద్రబాబు మాట్లాడిన ఈ మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్: షర్మిల ఎద్దేవా
అన్ని ఆధారాలు కనిపిస్తుంటే అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగడం ఏంటని నిలదీశారు.

YS Sharmila, Chandrababu Naidu
పారిశ్రామికవేత్త అదానీపై చర్యలు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కచ్చితమైన సమాచారం కావాలట అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట అని ఎద్దేవా చేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
చంద్రబాబు మాట్లాడిన ఈ మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ అని ఆమె అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్లారంటూ ఆమె నిలదీశారు. అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని ప్రశ్నించారు.
అదానీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారు? అని షర్మిల అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారని నిలదీశారు. ప్రతిపక్షంలో ఉండగా అదానీని శత్రువుగా చూసి, అధికార పక్షంలో అదే అదానీని మిత్రుడిగా చూస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని తెలిపారు.
అన్ని ఆధారాలు కనిపిస్తుంటే అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగడం ఏంటని నిలదీశారు. ఈ తీరు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని తెలిపారు. అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారని చెప్పారు.
కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని సైతం రంగంలోకి దించకపోవడం అదానీని కాపాడుతున్నారనే దానికి నిదర్శనమని అన్నారు. అదానీపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజమని చెప్పారు. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది వాస్తవమని అన్నారు.
అదానీతో చంద్రబాబుకి రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయండని, విచారణ జరిపించండని షర్మిల డిమాండ్ చేశారు.
అదానీపై @gautam_adani చర్యలకు చంద్రబాబు @ncbn గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు గారి మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు ? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని…
— YS Sharmila (@realyssharmila) January 23, 2025
అందరూ చూస్తుండగానే క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి.. మూడో అంతస్తు నుంచి దూకేసిన విద్యార్థి