YS Sharmila: జగన్ గురించి విజయసాయిరెడ్డి నాకు ఈ విషయాలు అన్నీ చెప్పేశారు: వైఎస్ షర్మిల
జగన్ కుట్రను తాను బయట పెట్టానని, విజయమ్మ లేఖ కూడా రాశారని షర్మిల గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. గన్నవరం విమానాశ్రయంలో తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్‌కు ఉన్న విశ్వసనీయత జీరో అని అన్నారు. సొంత మేనల్లుడు, మేన కోడలు ఆస్తులు జగన్ కాజేయాలని కుట్రలు చేశారని తెలిపారు.
విజయసాయి రెడ్డికి నచ్చకపోయినప్పటికీ 40 నిమిషాల పాటు అబద్ధాలు చెప్పాలని ఆయనకు జగన్ స్క్రిప్ట్ ఇచ్చారని షర్మిల ఆరోపించారు. సాయిరెడ్డితో చాలా విషయాలు చర్చకు వచ్చాయని, జగన్ దగ్గర పడ్డ ఇబ్బందుల గురించి ఆయన తనకు చాలా చెప్పారని అన్నారు. జగన్ సొంత తల్లి మీద కేసు పెట్టించారని తెలిపారు.
జగన్ కుట్రను తాను బయట పెట్టానని, విజయమ్మ లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. జగన్ తన మీద అబద్ధాలు చెప్పాలని సాయిరెడ్డికి చెప్పారని అన్నారు. సాయిరెడ్డి చెప్పను అని అంటే ఆయనతో బలవంతంగా చెప్పించారని తెలిపారు. స్వయంగా సాయిరెడ్డికి జగన్ కాల్ చేశారని, ప్రెస్ మీట్ పెట్టాలని ఒత్తిడి చేశారని అన్నారు. కుదరదని సాయి రెడ్డి చెబితే జగన్ ఒప్పుకోలేదని చెప్పారు.
వైఎస్ఆర్ ఉన్నప్పుడే ఇద్దరు బిడ్డలకు సమాన వాటా ఉంది అని సాయి రెడ్డి చెప్పారని షర్మిల అన్నారు. అందరి సమక్షంలో జరిగిన నిర్ణయం అని సాయి రెడ్డి చెప్పారని తెలిపారు. తనను వదిలేయాలని సాయి రెడ్డి వేడుకొంటే సుబ్బారెడ్డితో జగన్ మాట్లాడించారని చెప్పారు.
సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మళ్లీ సాయిరెడ్డి మీద ఒత్తిడి తెచ్చారని, తనకు ఇష్టంలేదని సాయిరెడ్డి వేడుకున్నా వదిలి పెట్టలేదని అన్నారు. ఈ విషయం స్వయంగా సాయిరెడ్డి చెప్పారని తెలిపారు.
సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలు అన్నీ స్వయంగా జగన్ నోట్ ఇచ్చారని చెప్పారు. 40 నిమిషాల పాటు జగన్ చెప్తుంటే నోట్ చేసుకున్నారని తెలిపారు. జగన్ నైజం ఇదే అని సాయి రెడ్డి అర్థం చేసుకున్నారని చెప్పారు. సాయి రెడ్డి చెప్తుంటే చాలా బాధ వేసిందని, జగన్ ఇంతలా దిగజారాలా అని అన్నారు. వైఎస్ఆర్ కొడుకు అయ్యి ఉండి క్యారెక్టర్ దిగజారాలా అని చెప్పారు.
క్యారెక్టర్ లేని జగన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారని, క్యారెక్టర్ మీద డైలాగ్ లు చెప్తున్నారని అన్నారు. క్యారెక్టర్ అనే పదం అర్థం కూడా జగన్ కి తెలియదని తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబ పరువు తీయొద్దు అని వేడుకుంటే అబద్ధాలు చెప్పించిన జగన్‌కు క్యారెక్టర్ ఉన్నట్లా అని షర్మిల నిలదీశారు.