విశాఖ తూర్పుపై ఫోకస్ పెట్టిన వైసీపీ.. పాత వాళ్లకు పక్కకే

విశాఖ తూర్పు నియోజకవర్గమంటేనే టీడీపీకి కంచుకోట. పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా వెలగపుడి రామకృష్ణబాబు గెలుపొందారు. తొలుత విశాఖ-2 నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపొందాలని ప్రయత్నం చేసిన వారెవ్వరూ ఆ ఛాయలకు కూడా రాలేకపోయారు. గడిచిన రెండు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులను మార్చి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
ఈసారి ఎలాగైనా ఆ సీటును కైవసం చేసుకోవాలని వైసీపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టిందట. 2009 ఎన్నికల ముందు వరకూ విశాఖ-2 నియోజకవర్గంలో భాగంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగిన పునర్విభజనలో విశాఖ తూర్పు నియోజకవర్గంగా మారింది. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి వెలగపుడి రామకృష్ణబాబు, ప్రజారాజ్యం పార్టీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి వరకూటి అప్పారావు పోటీ చేశారు. 4 వేల ఓట్ల మెజారిటీతో వెలగపూడి విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి వంశీకృష్ణ, తెలుగుదేశం నుంచి వెలగపూడి తిరిగి పోటీ చేశారు. ఈసారి ఏకంగా 47 వేల మెజారిటీ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున వంశీకృష్ణ కాకుండా అక్రమాని విజయనిర్మల పోటీ చేశారు. గ్రూపుల గోల, ఇతర కారణాలతో ఆ ఎన్నికల్లో కూడా వెలగపుడి గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
వంశీకృష్ణకు మేయర్ సీటు ఇస్తామని హామీ ఇవ్వడంతో దాదాపుగా ఎమ్మెల్యే సీటుపై ఆశ వదులుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన అక్రమాని విజయనిర్మల క్యాడర్‌ను పట్టించుకోవడం లేదని ఇప్పటికే పలుమార్లు అధిష్టానం దృష్టిలోకి రావడం, వెలగపూడి వేగాన్ని అందుకోకలేకపోవడంతో ఇప్పుడు కొత్త నియోజకవర్గం కన్వీనర్ కోసం వైసీపీ వెదుకుతోంది. ఈ సమయంలోనే వైసీపీ అధిష్టానికి కనిపించారు మాజీ ఎమ్మేల్యే పంచకర్ల రమేష్ బాబు.
పంచకర్ల రమేశ్‌బాబు ప్రజారాజ్యం పార్టీ నుంచి విశాఖ ఉత్తరం ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో గెలిచారు. యలమంచిలి నుంచి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గతంలో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణ వేగాన్ని తట్టుకోగలగడంతో పాటుగా అటు ఆర్థికంగా, సామాజికపరంగా పంచకర్ల తట్టుకోగలరని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.
విశాఖ తూర్పులో ప్రధానంగా జాలర్లు, యాదవులు, కమ్మ, కాపు సామాజికవర్గాలకు చెందినవారు ఎక్కువగా ఉంటారు. కాపు, యాదవ సామాజిక వర్గాలను ఆకట్టుకోగలిగితే గెలుపు తమదే అనే ధీమాలో వైసీపీ ఉంది. దీంతో కాపు సామాజికవర్గానికి చెందిన పంచకర్ల రమేష్‌బాబు అయితే బాగుంటుందని భావిస్తున్నారట వైసీపీ పెద్దలు. నిజానికి గత ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేయాలనుకున్నా ఆ పార్టీ పట్టించుకోలేదు.
విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి కేకే రాజు సమన్వయకర్తగా దూసుకుపోతున్నారు. ఆయనను మార్చే ఆలోచన వైసీపీకి లేదు. కాని వెలగపూడికి చెక్ పెట్టడానికి విశాఖ తూర్పు నుంచి పంచకర్లను బరిలోకి దింపాలనే అలోచనలో ఉందని అంటున్నారు.