Tdp : చంద్రబాబు కీలక ప్రకటన.. టీడీపీ అభ్యర్థుల్లో మొదలైన టెన్షన్
ఐదేళ్లుగా ఉప్పు నిప్పులా రెండు వర్గాలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ వర్గం ఇప్పుడు తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

Tickets Row In Tdp
Tdp : టీడీపీలో టికెట్ల పంచాయితీ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన చోట్ల అసమ్మతి నేతల ఆందోళన తారస్థాయికి చేరింది. తప్పదనుకుంటేనే టికెట్లు ఇచ్చిన చోట్ల మార్పులు ఉంటాయని చంద్రబాబు ప్రకటించడంతో ఆశావహులతో పాటు టికెట్లు దక్కించుకున్న అభ్యర్థుల్లోనూ ఆందోళన మొదలైంది. అసమ్మతి నేతలంతా ఏకమై టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ హైకమాండ్ పై గరంగరం అవుతున్నారు. ఉండి, గజపతినగరం నియోజకవర్గాల్లో తమ్ముళ్ల అసమ్మతి పీక్స్ కు చేరింది.
మంతెన రామరాజు కంటతడి..
ఏలూరు జిల్లా ఉండి నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి తార స్థాయికి చేరింది. ఉండి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారంతో అక్కడి శ్రేణుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉండి టికెట్ ను రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారన్న ప్రచారంతో టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టుకున్నారు. తనకు ఇబ్బంది వచ్చింది అనగానే తన వెంట నడవటానికి వచ్చిన వారందరికీ రుణపడి ఉంటానంటూ కన్నీరుకార్చారు.
ఉగాది రోజు ఉండి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు ఆందోళన బాట పట్టారు. ఉండి ఎమ్మెల్యే టికెట్ రామరాజుకి కాకుండా రఘురామకృష్ణరాజుకి కేటాయిస్తారన్న ప్రచారంతో రామరాజు వర్గం టీడీపీ నేతలు, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. తమ నిరసన తెలిపారు. మంతెన రామరాజును మారిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే అంటూ ప్లకార్డులతో ఆందోళన బాట పట్టారు టీడీపీ నేతలు.
గజపతినగరం టీడీపీలో ట్విస్ట్..
అటు విజయనగరం జిల్లా గజపతినగరం టీడీపీలోనూ కొత్త ట్విస్ట్. కొండపల్లి శ్రీనివాసరావుకు టీడీపీ టికెట్ కేటాయించడంతో అసమ్మతితో రగులుతున్న రెండు వర్గాల నేతలు ఏకమయ్యారు. ఐదేళ్లుగా ఉప్పు నిప్పులా రెండు వర్గాలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు, కరణం శివరామకృష్ణ వర్గం ఇప్పుడు తమకు కాకుండా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇస్తే తమలో ఎవరికో ఒకరికి టికెట్ ఇవ్వాలంటున్నారు ఈ ఇద్దరు నేతలు.
మొత్తానికి సీటు తమకు ఇవ్వలేదని కొందరు నేతలు ఆగ్రహంతో ఉంటే ఇచ్చిన సీటును ఎలా వేరే వాళ్లకు కేటాయించాలనుకుంటారని టీడీపీ హైకమాండ్ పై మరికొందరు ఫైర్ అవుతున్న పరిస్థితి.
Also Read : ఆ ఇద్దరిలో ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా చరిత్రే.. భీమిలిలో గురు శిష్యుల మధ్య రసవత్తర పోరు