ప్రశాంతత కోసం శృంఖలాదేవిని దర్శించుకుంటే సరి.. ఈ శక్తిపీఠ మహిమ ఇదే..

ఈ ఆలయంలో ప్రసన్న వదనంతో అమ్మవారు ఆశీర్వదిస్తున్న భంగిమలో ఉంటారు.

ప్రశాంతత కోసం శృంఖలాదేవిని దర్శించుకుంటే సరి.. ఈ శక్తిపీఠ మహిమ ఇదే..

Pradyumna Shrinkhala Devi

Updated On : September 16, 2025 / 10:27 PM IST

Pradyumna Shrinkhala Devi: దక్షయజ్ఞం తర్వాత సతీదేవి పొత్తికడుపు భాగం పడిన ప్రాంతం ప్రద్యుమ్న క్షేత్రం. ఈ ఆలయంలో ప్రసన్న వదనంతో అమ్మవారు ఆశీర్వదిస్తున్న భంగిమలో ఉంటారు. ప్రశాంతత కోసం భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు.

ప్రద్యుమ్నం ఎక్కడ ఉందనే విషయమై పలు అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ప్రాంతం “ప్రద్యుమ్నం”గా భావిస్తున్నారు. శృంఖలాదేవి ఆలయం ఎక్కడ వుండేది సరిగ్గా తెలియడం లేదుగానీ..కొందరు కలకత్తా నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో కొలువుదీరి వున్న దేవియే ’శృంఖలాదేవి’ అని అంటున్నారు.

మరికొంతమంది గంగాసాగర్‌లోని ఆదినాధ క్షేత్రం అని..కొంతమంది గుజరాత్ లోని చోటిల్లా అని,విభిన్న కథనాలు ఉన్నాయి.. అయితే ప్రస్తుతం ఇక్కడ హజ్రత్ షా దర్గా – మినార్ మాత్రమే ఉంది… అవసాన దశలో ఉన్న ఆలయంలోని కొన్ని ప్రదేశాలు మాత్రం పురావస్తు శాఖ అధీనంలో ఉన్నాయి..ఇప్పటికీ ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ ప్రతి మాఘమాసంలో మేళతాళాలతో ఉత్సవాలు, తిరున్నాళ్లు జరుగుతుంటాయి.

త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు హిందువులు పురాణాల ఆధారంగా నమ్ముతారు. పూర్వం వంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజ్యం సస్యశ్యామలమై ఉండేది. అయితే ఒకసారి తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలలాడసాగారు. (Pradyumna Shrinkhala Devi)

కరువును గురించి తీవ్రమైన ఆలోచనలు చేసిన రోమపాదుడు ఋష్యశృంగుని గురించి విన్నాడు. విభాండకుడు, చిత్రరేఖల కుమారుడు ఋష్యశృంగుడు. తపోబల సంపన్నుడు. ఆయన ఎక్కడ కాలుమోపితే అక్కడ సస్యశ్యాలమే. ఈ విషయం గురించి విన్న రోమపాదుడు, ఋష్యశృంగుని తీసుకువచ్చేందుకు కొందరు యువతులను ఆశ్రమానికి పంపాడు.

అంతవరకూ ఆశ్రమం వదలి బయటకు వెళ్ళని, ముని కుమారులను మినహా యితరులను చూసి ఎరుగని ఋష్యశృంగుడు యువతులను, వారి అందాలను చూసి ఆశ్చర్యపడి, వారి ఆశ్రమాలు ఎంత అందంగా ఉంటాయో చూడాలనే ఉత్సాహం కలుగగా, వారి వెంట వంగదేశం చేరుకున్నాడు. ఋష్యశృంగుడి పాదం మోపడంతోనే కరువుపోయి, వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలం అయింది.

రోమపాదుడు తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. ఈవిధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లు కథనం. శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగలా దేవి అని పేర్. కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవి అయింది.