సామాన్యుడికి అందనంత దూరంలో పసిడి.. ఆల్‌టైమ్ రికార్డు
Gold: గతంలో పెండ్లికి ఇచ్చే కట్నంలో ఎక్కువగా బంగారమే పెట్టేవారు. ఇప్పుడు పది లక్షలు పెడితే..

Gold Rate Increase
ఆడవాళ్లకు ఆభరణాలే అందం. తరాలు మారుతున్నా కట్టుకునే దుస్తులు, వేసుకునే ఆభరణాలపై ఏ మాత్రం ఆసక్తి తగ్గదు. బంగారం కేవలం అలంకరణ కోసమే కాదు.. తమ హోదాను తెలియజేసేందుకు సైతం ధరిస్తుంటారు. కాని ఇప్పుడు ఆభరణాల జోలికి వెళ్లే పరిస్థితి లేదు. సాన పెట్టకముందే స్వర్ణం సుర్రుమంటోంది.
పసిడి రేట్లు పైపైకే వెళ్తున్నాయి. ఆకాశమే హద్దుగా సామాన్యులు కొనలేనంతగా పెరిగిపోతున్నాయి బంగారం ధరలు. రికార్డు స్థాయి రేట్లతో బంగారం ధర 74వేలకు చేరువలో ఉంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, గ్లోబల్ మార్కెట్లో కూడా ఊహించని డిమాండ్ రావడంతో దేశీయ మార్కెట్లలో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర 72 వేల మార్కును క్రాస్ చేసింది. నెల రోజుల్లోనే గోల్డ్ రేట్ దాదాపు 8 వేల రూపాయలకు పైగా పెరిగి.. ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసింది.
తులం ధర 72వేలు దాటి..
పండగలు.. వివాహ శుభకార్యాలు అయిపోయాక కొందామనుకున్నవారికి బంగారు ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఆకాశాన్నంటిన ధరలు చూసి కొనే సాహసం చేయలేకపోతున్నారు. తులం ధర 72వేలు దాటి పసిడి ధర పరుగులు పెడుతుండటంతో ఇప్పట్లో గోల్డ్ కొనే పరిస్థితి లేదంటున్నారు పబ్లిక్. 66వేలు ఉన్నప్పుడు కొందామనుకుంటేనే హై ప్రైస్ అని వెనకాడితే ఇప్పుడు లక్ష రూపాయలు అయ్యేట్లు ఉందని ఆందోళన చెందుతున్నారు.
ఆభరణాలను ఎక్కువగా 22 క్యారట్ బంగారంతో చేస్తుంటారు. రేట్లు పెరగడంతో ఆభరణాల తయారీదారులు రూట్ మార్చారు. 18, 16 క్యారట్లతో కొత్త డిజైన్లను మేకింగ్ చేస్తున్నారు. కరోనాకు ముందు వరకు 10 గ్రాముల బంగారం ధర రూ.40 వేల వరకు ఉండేది. ఆ తర్వాత మూడేళ్లలోనే అది రూ.70 వేలు దాటేసింది. ఈ స్థాయిలో ధరలు పెరిగితే నచ్చిన మోడల్స్ కొనే పరిస్థితి లేదంటున్నారు మహిళలు.
1967 నుంచి ఇప్పటివరకు
ఈ ఏడాది ప్రారంభంలో కొద్దిగా జోరుతగ్గినట్లు కనిపించినప్పటికీ… నెల రోజులుగా గోల్డ్ రేట్ హైస్పీడ్‌తో వెళ్తుంది. ఇప్పుడున్న గోల్డ్ రేట్ ఆల్‌టైమ్ హైగా రికార్డు క్రియేట్ చేసింది. 1967 నుంచి ఇప్పటివరకు బంగారం ఎన్నో మైలురాళ్లు దాటుతూ వచ్చింది. 1967లో తులం బంగారం ధర 102 రూపాయలు. 2024కు వచ్చేసరికి తులం బంగారం ధర 72వేలకు చేరుకుంది..
1980లో మొదటిసారిగా వెయ్యి రూపాయలు దాటి 13వందల 80రూపాయలకు చేరుకుంది బంగారం ధర. ఆ తర్వాత 2వేల సంవత్సరం వరకు తులం బంగారం ధర 5వేల లోపే. ఇక 2007 నుంచి పసడి పరుగులు స్టార్ట్ అయ్యాయి. 2011కి వచ్చే సరికి తులం బంగారం ధర 26వేలు దాటింది. 2018 వరకు కూడా 31వేల మార్క్‌లోనే ఉంది గోల్డ్ రేటు. లాస్ట్ ఫై ఇయర్స్‌లో మాత్రం జెట్ స్పీడ్‌తో పరుగులు తీస్తోంది.. 2019లో 35వేలున్న బంగారం ధర ఐదేళ్లలోనే డబుల్ అయింది.
పండుగలకయినా, ఏ శుభకార్యాలైనా ముందుగా కొనేది బంగారాన్నే. కొన్ని నెలలుగా స్టేబుల్‌గా ఉన్న బంగారం రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా దూసుకెళ్తున్నాయి.. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలతో పాటు పలు శుభకార్యాలకు ఎంతో కొంత బంగారం కచ్చితంగా కొనే సంప్రదాయం మన దగ్గర ఉంది.
పెరిగిన ధరలతో మాత్రం సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం వైపు కన్నెత్తి చూసే పరిస్థతి లేదు. గతంలో పెండ్లికి ఇచ్చే కట్నంలో ఎక్కువగా బంగారమే పెట్టేవారు. ఇప్పుడు పది లక్షలు పెడితే పది తులాల బంగారమే వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. దాంతో మిగిలిన ఖర్చులు తగ్గించుకుని బంగారం కొనాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటున్నారు పబ్లిక్.
బాబోయ్.. గత ఐదేళ్లలో 24 క్యారట్ల తులం గోల్డ్ ధర ఎంత పెరిగిందో తెలుసా? కారణం ఏమిటంటే..