Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణతో అందుబాటు ధరల్లో ఇళ్లు.. అదెలాగంటే!

మెట్రో విస్తరణతో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో విస్తరణతో అందుబాటు ధరల్లో ఇళ్లు.. అదెలాగంటే!

Hyderabad Metro Expansion

Hyderabad Metro Expansion: అంతర్జాతీయ ఐటీ కంపెనీలు (international it companies) ప్రపంచస్థాయి మౌలిక వసతులు.. ట్రాఫిక్ చిక్కులు లేని ఔటర్ రింగ్ రోడ్డు (outer ring road) ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇప్పటికే సక్సెస్ ఫుల్‌గా పరుగులు పెడుతున్న 69 కిలోమీటర్ల మెట్రో రైల్‌కు తోడు మరో 346 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది. వినడానికే అద్భుతంగా ఉంది కదా. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూనే కాకుండా హైదరాబాద్ శివారు ప్రాంతాలను కలిపే విధంగా మెట్రో రైల్ ప్రాజెక్టును (Metro Rail Project) చేపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. దీంతో వచ్చే ఐదారేళ్లలో సిటీ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో ఎటువైపైనా ట్రాఫిక్ చిక్కులు లేని కనెక్టివిటీ పెరగనుంది. ఈ భారీ మెట్రో ప్రాజెక్టుతో నగరానికి అన్ని వైపులా నిర్మాణ రంగం మరింత ఊపందుకోవడంతో పాటు అందరికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభించనున్నాయని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Hyderabad Real Estate indusrty boom with Metro Expansion

Hyderabad Metro Train

కొత్తగా 15 మార్గాల్లో మెట్రో లైన్
ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో, కనీవినీ ఎరుగని అభివృద్ధితో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో మెట్రో రైల్ కనెక్టివిటీ మరింత పెరగబోతోంది. ఇప్పటికే నగరంలో మూడు మార్గాల్లో 69 కిలోమీటర్లు మెట్రో రైల్‌
సౌకర్యం ఉండగా, ఇప్పుడు కొత్తగా 15 మార్గాల్లో మెట్రో లైన్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో ఇప్పటికే ఉన్న కారిడార్ల పొడిగింపుతో పాటు కొత్తగా ప్రతిపాదించిన మార్గాలున్నాయి. హైదరాబాద్‌
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్తగా 346 కిలోమీటర్లు అంటే మొత్తం 415 కిలోమీటర్ల మేర మెట్రో భారీ విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది కేసీఆర్ సర్కార్. దీంతో భాగ్యనగరం జనాభా 2 కోట్లకు పెరిగినా
ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ఈ భారీ మెట్రో ప్రాజెక్టును చేపడుతున్నారు.

Also Read: ఎకరం 100 కోట్లపైనే.. ఇంతకీ కోకాపేట నియోపోలిస్ ప్లాట్ల ప్రత్యేకత ఏంటి.. వాటికి ఎందుకంత భారీ డిమాండ్?

Hyderabad Real Estate indusrty boom with Metro Expansion

Hyderabad Metro Expansion Map

అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మెట్రో కనెక్టివిటీ
హైదరాబాద్‌లో కొత్తగా విస్తరించబోయే మెట్రో ప్రాజెక్టుకు సుమారు 69 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు 20 కిలోమీటర్లు నిర్మించనున్న మెట్రో ఇప్పటికే టెండర్‌
దశలో ఉంది. ఇక 158 కిలోమీటర్లు ఉన్న అవుటర్‌ రింగ్‌ రోడ్డు చుట్టూ మెట్రో రానుంది. ఔటర్ చుట్టూ వచ్చే మెట్రో మార్గంలో 37 కిలోమీటర్లు భూమార్గం మీదుగా వెళ్ళనుండగా, మిగతా భాగం ఎలివేటెడ్‌లో వెళ్తుంది.
ఔటర్ రింగ్ రోడ్డు శంషాబాద్‌ సర్కిల్ నుంచి తుక్కుగూడ, బొంగళూరు, పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌ వరకు 40 కిలోమీటర్ల వరకు మెట్రో విస్తరణ జరగనుంది. దీంతో రావిర్యాల, హార్డ్‌వేర్‌ పార్క్‌, ఫ్యాబ్‌సిటీ, కొంగరకలాన్‌,
వండర్‌లా, టీసీఎస్‌ ఆదిభట్ల, తొర్రూర్‌, రామోజీ ఫిల్మ్‌సిటీ వరకు మెట్రో కనెక్టివిటీ పెరగనుంది.

Hyderabad Real Estate indusrty boom with Metro Expansion

Hyderabad Ring Road

పటాన్‌చెరు నుంచి కోకాపేట వరకు..
మరో రూట్‌లో ఔటర్ రింగ్ రోడ్డు పెద్ద అంబర్‌పేట నుంచి ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, మేడ్చల్‌ వరకు 45 కిలోమీటర్లు మెట్రో లైన్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గంలో తారామతిపేట, గౌరెల్లి, కీసర, ఇన్ఫోసిస్‌, కరీంగూడ రోడ్‌,
కీసరగుట్ట, యాదగిరిపల్లిరోడ్డు, మునీరాబాద్‌ వరకు కనెక్టివిటీ ఉండనుంది. మరో రూట్‌లో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మేడ్చల్‌ నుంచి దుండిగల్‌, పటాన్‌చెరు వరకు 29 కిలో మీటర్ల వరకు మెట్రో మార్గం రానుంది.
దీంతో శేరిగూడెం, సుల్తాన్‌పూర్‌, సీఎంఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌, గౌడవెల్లి, ఎంఎల్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, మల్లంపేట రోడ్డు వరకు మెట్రో అందుబాటులోకి వస్తుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పటాన్‌చెరు
నుంచి కోకాపేట, నార్సింగి వరకు 22 కిలోమీటర్ల వరకు మెట్రో మార్గంతో పూర్తిగా ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో కనెక్టివిటీ పెరగనుంది.

Hyderabad Metro Expansion

Hyderabad Metro Expansion

మెట్రో విస్తరణతో రియల్ రంగంలో జోరు
ఇలా హైదరాబాద్‌లో మరో 415 కిలోమీటర్ల మెట్రో అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా ట్రాఫిక్ చిక్కులు లేకుండా సిటీలోకి వచ్చి వెళ్లిపోవచ్చు. ఇప్పుడు నగర శివారులో ఎక్కడి నుంచైనా సిటీలోకి
రావాలంటే కనీసం గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. అదే మెట్రో అందుబాటులోకి వస్తే 30 నిమిషాల్లోనే ఎక్కడికైనా చేరుకోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ నగర శివారుల్లో రియల్ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ,
415 కిలోమీటర్ల వరకు మెట్రో రైల్ విస్తరణతో భారీ నిర్మాణ సంస్థల చూపు అటువైపు మరలుతోంది. ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనాలంటే కనీసం కోటిన్నర రూపాయలు ఖర్చు చేయాల్సి
వస్తోంది. మెట్రోరైల్ ప్రాజెక్టుతో నగర శివారు పరిసర ప్రాంతాల్లో నివాస నిర్మాణాలు వస్తే రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల్లో ఫ్లాట్ లభించే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్.. అందుకే భారీ డిమాండ్

మెట్రో విస్తరణ ప్రాణాళికలతో ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతాలైన పటాన్‌చెరు, శంకర్‌పల్లి, మేడ్చల్, ఘట్‌కేసర్, పెద్దఅంబర్ పేట్, శామీర్‌పేట్, కొంపల్లి, కొత్తూర్‌ తదితర ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టులు భారీగా వచ్చే
అవకాశం ఉంది. దీంతో మధ్య తరగతి వారికి అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. మెట్రోతో కనెక్టివిటీకి సమస్య ఉండదు. అందుకే కాస్త దూరమైనా శివారు ప్రాంతాల్లో
కొనేందుకు మధ్య తరగతి వారు మొగ్గు చూపుతారని చెబుతున్నారు.