Ola Electric : ఓలా ‘హైపర్ డెలివరీ’ అదుర్స్.. ఇకపై కొన్న రోజే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు.. పండగ చేస్కోండి..!
Ola Electric : హైపర్ డెలివరీ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆన్‌లైన్‌లో లేదా ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోపు కస్టమర్‌లు రిజిస్టర్ చేసిన ఓలా స్కూటర్లను ఇంటికి తీసుకెళ్లొచ్చునని కంపెనీ తెలిపింది.

Ola Electric
Ola Electric : ఓలా కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏప్రిల్ 3న హైపర్ డెలివరీని ప్రకటించింది. ఈ సర్వీసు కింద ఓలా స్కూటర్లను రిజిస్ట్రేషన్ రోజే ఇంటికి తీసుకెళ్లవచ్చు.
ఈ హైపర్ డెలివరీకి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ బెంగళూరులో ప్రారంభమైంది. ఈ త్రైమాసికంలో దశలవారీగా దేశమంతటా ఈ సర్వీసును విస్తరిస్తామని కంపెనీ ప్రకటించింది. హైపర్ డెలివరీ కింద ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్‌లైన్‌లో లేదా ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చు.
Read Also : Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 15వరకు జియోహాట్‌స్టార్ ఫ్రీగా చూడొచ్చు.. ఇప్పుడే ఇలా చేయండి!
ఇకపై ఒకేరోజున రిజిస్ట్రేషన్, డెలివరీ :
ఆ తర్వాత కస్టమర్‌లు కొన్ని గంటల్లోపు పూర్తిగా రిజిస్టర్ అయిన వాహనంలో ఇంటికి వెళ్లవచ్చని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆటోమేట్ చేయడానికి కంపెనీ ఏఐ టెక్నాలజీని వాడుతోంది.
అలాగే, రిజిస్ట్రేషన్, డెలివరీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు మధ్యవర్తులను తొలగించింది. ఇకపై ఓలా పూర్తిగా ఇంటర్నల్‌గానే ఈ డెలివరీ ప్రాసెస్ జరుగనుంది. ఏఐ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ ప్రాసెసింగ్ సమయాన్ని భారీగా తగ్గించింది.
ఓలా ఎలక్ట్రిక్ ప్రతినిధి మాట్లాడుతూ.. “ఏఐ నేతృత్వంలోని ఆటోమేషన్ ద్వారా ఓలా స్కూటర్లను రిజిస్టర్ చేసే ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా ఇంటర్నల్‌గా మార్చేశాం.
ఆటోమోటివ్ ప్రాసెస్‌లో వాహన కొనుగోలు, డెలివరీ అనుభవాన్ని పూర్తిగా (#HyperDelivery)తో మార్చేశామని ప్రకటించేందుకు చాలా సంతోషంగా ఉంది. మా కస్టమర్లకు వేగవంతమైన సర్వీసును అందించాలని భావిస్తున్నాం. కొనుగోలుతో పాటు డెలివరీ సమయాన్ని మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
హైపర్ డెలివరీ ద్వారా ఆటోమోటివ్ రంగంలో అతిపెద్ద మార్పును సూచిస్తుంది. ఆటోమేషన్, ఏఐ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియలతో ఓలా ఎలక్ట్రిక్ సాధారణంగా వాహన కొనుగోళ్లతో కలిగే జాప్యాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవతో కస్టమర్‌లు కొన్ని గంటల్లో కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని రైడ్ చేస్తూ ఇంటికి తీసుకెళ్లొచ్చు అనమాట.
మార్చిలో 23,430 వాహనాల రిజిస్ట్రేషన్లు :
ఈ ఏడాది మార్చిలో ఓలా ఎలక్ట్రిక్ 23,430 వాహనాలను రిజిస్టర్ చేసుకుంది. రోజువారీ రిజిస్ట్రేషన్లు, పెండింగ్‌లో ఉన్న డెలివరీ సెటిల్‌మెంట్ల సంఖ్య మెరుగుపడుతున్నట్లు కంపెనీ చెబుతోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెండింగ్ డెలివరీ దాదాపుగా పరిష్కరించింది. ఫిబ్రవరి-మార్చిలో రిజిస్టర్ అయిన ఇతర వాహనాలు ఏప్రిల్ 2025 నాటికి డెలివరీ అవుతాయని భావిస్తున్నారు.