యస్ బ్యాంకు నుంచి రూ.265 కోట్లు విత్ డ్రా చేసిన గుజరాత్ సంస్ధ

  • Published By: chvmurthy ,Published On : March 7, 2020 / 05:38 PM IST
యస్ బ్యాంకు నుంచి రూ.265 కోట్లు విత్ డ్రా చేసిన గుజరాత్ సంస్ధ

Updated On : March 7, 2020 / 5:38 PM IST

దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో అయిదో స్థానంలో ఉండి సంక్షోభంలో చిక్కుకున్న యస్ బ్యాంక్ మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మారటోరియం విధించింది. దీనితో పాటు.. వినియోగదారులు రూ. 50,000 మొత్తానికి మించి నగదు విత్‌డ్రా చేయకుండా పరిమితి విధించటం.. కస్టమర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.  

ఈ ప్రకటన రావటానికి ఒక రోజు ముందు అంటే బుధవారం నాడే (మార్చి4న) గుజరాత్ కు చెందిన ఒక సంస్ధ యస్ బ్యాంకు నుంచి రూ. 265 కోట్ల రూపాయలను విత్ డ్రా చేసుకుని ఒడ్డున పడింది. వడోదర మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన (విఎంసీ)… వడోదర స్మార్ట్ సిటీ డెవలప్ మెంట్ కంపెనీకి యస్ బ్యాంకు లో ఖాతా ఉంది. అందులో  భారీగా నగదు నిల్వలు ఉన్నాయి. స్మార్ట్ సిటీ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆ బ్యాంకు లోనే జమ అయ్యేవి.  

రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించటానికి ఒకరోజు ముందే బ్యాంకు నుంచి రూ.265 కోట్లు విత్ డ్రా చేసినట్లు విఎంసి డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ సుధీర్ పటేల్  వెల్లడించారు.  విత్ డ్రా చేసిన మొత్తాన్ని తిరిగి బ్యాంకు ఆఫ్ బరోడాలో తెరిచిన కొత్త ఖాతాలోకి జమ చేసినట్లు ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్ధానం యస్ బ్యాంకులో డిపాజిట్ చేసిన 1300 కోట్ల రూపాయలను కూడా కొద్ది నెలల కిందట విత్ డ్రా చేసుకుంది. పూరీ జగన్నాధ స్వామి ఆలయానికి చెందిన సుమారు  రూ.230 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. ఇప్పుడు గుజరాత్ లోని వడోదర మున్సిపాలిటీ ముందుగా జాగ్రత్తపడి తన డిపాజిట్లను విత్ డ్రా చేసుకుని బయట పడింది.