ఔటర్ టెర్రర్ : అంబులెన్స్, కారు ఢీ : 4 మృతి
ఔటర్ రింగ్‌రోడ్డు నెత్తురోడింది. ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్, కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకరు కేన్సర్ పేషెంట్, మరొకరు అంబులెన్స్ డ్రైవర్. 2019, జవనరి 11వ తేదీ శుక్రవారం ఉదయం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ముగ్గురితోపాటు అంబులెన్స్ డ్రైవర్ మృతి చెందాడు. అంబులెన్స్‌లోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వరరావు(60) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ఆస్పత్రిలో కేన్సర్ చికిత్స పొందాడు. చికిత్స పూర్తికావడంతో భార్య సుబ్బలక్ష్మి(55), సోదరుడు రామారావు(70), కుమారుడు హేమచందర్‌రావు, అల్లుడు శ్రీనివాసరావుతో కలిసి ప్రైవేటు అంబులెన్స్‌లో జనవరి 10వ తేదీ గురువారం రాత్రి హైదరాబాద్ మీదుగా బళ్లారికి బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట నుంచి ఔటర్‌రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్‌కు వెళ్లే క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకు తుక్కుగూడ రావిర్యాల సమీపంలోని ఔటర్ ఎగ్జిట్ 13 వద్దకు వచ్చారు.
ఆ సమయంలో శంషాబాద్ నుంచి బొంగళూరు గేటుకు వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటుకుని అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి, అంబులెన్స్ డ్రైవర్ శివ స్పాట్ లోనే మృతిచెందారు. హేమచందర్‌రావు, శ్రీనివాసరావు, రామారావు, అంబులెన్స్ మరో డ్రైవర్ మోహిద్ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారు కాగా.. అంబులెన్స్ డ్రైవర్ శివది ఆంధ్రప్రదేశ్. హస్తినాపురానికి చెందిన మనోజ్‌తోపాటు ఆరుగురు కారులో ఉన్నారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ర్యాష్ డ్రైవింగ్ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. మనోజ్‌పై కేసు నమోదు చేశారు.