Suspicious Death : చిట్టీల వ్యాపారి అనుమానాస్పద మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారానికి చెందిన శ్రీనివాస గౌడ్ అనే చిట్టీల వ్యాపారి అనుమానాస్పద స్ధితిలో శవమై కనిపించాడు.

Suspicious Death
Suspicious Death : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారానికి చెందిన శ్రీనివాస గౌడ్ అనే చిట్టీల వ్యాపారి అనుమానాస్పద స్ధితిలో శవమై కనిపించాడు. కొన్నేళ్లుగా శ్రీనివాస్ గౌడ్ చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతేడాది చిట్టీల వ్యాపారం సరిగా జరగలేదు. సక్రమంగా డబ్బులు వసూలు కాకపోవటం… బయట అప్పులు ఇచ్చిన వారు డబ్బులు తిరిగి చెల్లించమని వత్తిడి చేయటం ప్రారంభించారు. దీంతో తీవ్రమానసికి వేదనకు గురయ్యాడు.
ఈక్రమంలో మే 11 న శంకర్ పల్లి లో చిట్టీల డబ్బులు ఇవ్వాల్సిన వారి వద్దకువచ్చి డబ్బులు అడిగాడు. వారు ఇప్పుడు కట్టలేమని చెప్పారు. ఈ విషయం అదే రోజుసాయంత్రం భార్యకు ఫోన్ చేసి చెప్పి బాధ పడ్డాడు.
అప్పటినుంచి ఇంటికి వెళ్లని శ్రీనివాస్ గౌడ్ బుధవారం మే 19న శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ లో సగం కాలిపోయిన స్ధితిలో శవమై కన్పించాడు. అక్కడే అతడి ద్విచక్రవాహానం కూడా కాలిపోయి కనిపించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసుల ఘటనా స్ధలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ గౌడ్ ఎలా మృతిచెందాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.