ESI IMS స్కామ్ : రూ. 3 కోట్ల బంగారం కొన్న దేవికారాణి

ESI IMS స్కామ్‌లో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా… IMS డైరెక్టర్ దేవికారాణి అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో దేవికాతో పాటు పలువురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరిపిన సంగతి తెలిసిందే. రోజు రోజుకు సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ క్రమంలో దేవికా రాణి డొల్ల కంపెనీల వ్యవహారం వెలుగు చూసింది.
తేజ ఫార్మా కంపెనీ రాజేశ్వర్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి పేరిట రెండు షెల్ కంపెనీలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ రెండు కంపెనీల పేరిట డైరెక్టర్ దేవికారాణి, ఫార్మాసిస్ట్ నాగలక్ష్మిలు కోట్ల రూపాయలు దండుకున్నట్లు తేలింది. అలా నొక్కేసిన డబ్బుతో దేవికారాణి 3 కోట్ల రూపాయల బంగారం కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. మరోవైపు 2019, అక్టోబర్ 31వ తేదీ గురువారం అల్వాల్‌లోని శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
అంతకుముందు మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది. దేవికారాణి సూత్రధారిగా, ఇతర సిబ్బంది పాత్రదారులుగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది. 2017, 2018లో మెడికల్ కిట్ల కోసం 60 కోట్ల బడ్జెట్ కేటాయించారు. వీటిలో మొత్తం 22 ఇండెంట్లు ఉండగా విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు రెండు ఇండెంట్లను పరిశీలించారు. ఇందులో హెచ్ఐవీ కిట్ల పేరుతో కోటి 76 లక్షల రూపాయలు మింగేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో డైరెక్టర్, జేడీ కార్యాలయం సిబ్బంది పాత్రపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.
2019, సెప్టెంబర్ 26 తెల్లవారుజాము 4 గంటల నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇన్సూరెన్స్ మెడికల్ డైరెక్టర్ దేవికారాణి, వరంగల్ జాయింట్ డైరెక్టర్ పద్మతో పాటు… ఓ ఛానల్ ప్రతినిధి కాజీపేట నరేందర్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఏకకాలంలో 23 చోట్ల సోదాలు జరిపారు. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి ఈ కుంభకోణం బయటపెట్టారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టు గుర్తించిన ఆయన.. భారీ స్కామ్ ని వెలుగులోకి తెచ్చారు. ఈ స్కామ్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ కిట్ల పేరుతో కోట్ల రూపాయల నిధులు గోల్ మాల్ జరిగినట్లు ఏసీబీ తేల్చింది. ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి సూత్రధారిగా, ఇతర సిబ్బంది పాత్రదారులుగా అక్రమాలకు పాల్పడినట్లుగా ఏసీబీ గుర్తించింది.
Read More : చితక్కొట్టారు : విద్యార్థినులను వేధిస్తున్న కీచక వార్డెన్