GHMC Fake Certificates : హైదరాబాద్‌లో కలకలం.. భారీగా నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ

అవగాహనారాహిత్యంతో కొంతమంది అధికారులు చేసిన నిర్వాకం.. ఇప్పుడు బల్దియా జారీ చేసే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు అసలువా? నకిలీవా? అన్న అంశం సమస్యగా మారింది. ఇటు ప్రజలు, అటు అధికారుల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. కొత్త టెక్నాలజీ పేరుతో మీ-సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించింది. ప్రారంభంలో ఒక సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేస్తే మరో సర్టిఫికెట్ జారీ అయ్యింది.

GHMC Fake Certificates : హైదరాబాద్‌లో కలకలం.. భారీగా నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ

Updated On : March 7, 2023 / 9:23 PM IST

GHMC Fake Certificates : పుట్టిన ప్రతి బిడ్డకు జనన ధృవీకరణ పత్రం పొందడం హక్కు. దాన్ని విధిగా నమోదు చేయడం ప్రభుత్వం బాధ్యత. ఎవరు పుట్టినా లేదా చనిపోయినా వాటిని తప్పనిసరిగా రికార్డుల్లో చేర్చాలి. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఈ బాధ్యత చూస్తోంది. కానీ, కొందరు అధికారుల అవినీతి చర్యలతో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ వ్యాపార వస్తువుగా మారింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు రద్దయ్యాయి. వాటిని పొందిన వారి పరిస్థితి ఏంటి అన్న విషయం అగమ్యగోచరంగా మారింది. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బల్దియా జనన, మరణ ధృవ పత్రాల జారీలో ఆలస్యం అవుతోంది. అవినీతిని అరికడతాం అంటూ కొత్త టెక్నాలజీ తెచ్చింది జీహెచ్ఎంసీ. అవగాహనారాహిత్యంతో కొంతమంది అధికారులు చేసిన నిర్వాకం.. ఇప్పుడు బల్దియా జారీ చేసే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు అసలువా? నకిలీవా? అన్న అంశం సమస్యగా మారింది. ఇటు ప్రజలు, అటు అధికారుల్లో అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. కొత్త టెక్నాలజీ పేరుతో మీ-సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టించింది. ప్రారంభంలో ఒక సర్టిఫికెట్ కోసం అప్లయ్ చేస్తే మరో సర్టిఫికెట్ జారీ అయ్యింది.

Also Read..Aadhaar Update in Telugu : ఇకపై ఆధార్ అప్‌డేట్ చేస్తే చాలు.. ఇతర డాక్యుమెంట్లలోనూ మీ డేటా ఆటో అప్‌డేట్ కానుంది తెలుసా?

తాజాగా వెలుగులోకి వచ్చిన నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్లు అంటే ఆసుపత్రుల్లో జరిగిన జనన, మరణాలు కాకుండా ఇళ్ల దగ్గర జరిగిన జనన, మరణాల ధృవపత్రాలను ఇప్పుడు రద్దు చేసింది జీహెచ్ఎంసీ. ఇలాంటి నాన్ అవైలబులిటీ సర్టిఫికెట్లను రెవెన్యూ విభాగానికి చెందిన ఆర్డీవో ద్వారా క్షేత్రస్థాయి అధికారులు ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసి స్థానికుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని బర్త్ లేదా డెత్ సర్టిఫికెట్ల జారీకి సిఫార్సు చేసే వారు. అప్పుడు మాత్రమే జీహెచ్ఎంసీ ఇచ్చేది.

కానీ, ఇన్ స్టంట్ గా జనన, మరణాల ధృవపత్రాలను జారీ చేయాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ.. ఎలాంటి పేపర్ సబ్మిషన్ లేకపోయినా వాటిని పరిశీలించకుండానే, క్షేత్రస్థాయికి వెళ్లకుండానే ధృవపత్రాలు జారీ చేసింది. ఇలా మొత్తంగా 25వేల 400 వరకు బర్త్ సర్టిఫికెట్లు, 4వేల 500 వరకు డెత్ సర్టిఫికెట్లను జారీ చేసింది. ఇటీవల ఓల్డ్ సిటీలో కొన్ని అక్రమ సర్టిఫికెట్ల విషయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు తీగ లాగితే డొంక కదిలింది. అక్రమాలకు అడ్డాగా మారిన మూడు నాలుగు మీ-సేవా కేంద్రాలతో పాటు కొంతమంది జీహెచ్ఎంసీ ఉద్యోగులు కలిసి దందా చేసినట్లు విచారణలో తేలింది.

Also Read..Fake Message Scam : మీ ఫోన్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? జాగ్రత్త.. 3 రోజుల్లో 40మంది కస్టమర్ల అకౌంట్లు ఖాళీ.. ఈ లింక్ క్లిక్ చేస్తే ఖతమే..!

దీంతో ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లను తొలగించింది. అక్రమంగా పొందిన జనన ధృవీకరణ పత్రాల ఆధారంగా ఎంతమంది మైగ్రెంట్ సర్టిఫికెట్లు పొందారో.. ఆధార్ కార్డులు, పాస్ పోర్టులు ఎంతమంది పొందారో, ఎంతమంది విదేశాలకు వెళ్లారు? అన్న విషయాలను ఎవరూ చెప్పలేని పరిస్థితి నెలకొంది. కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చినప్పటి నుంచి దానిలోని లోపాలను అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి.

జనన, మరణ ధృవ పత్రాల జారీ విభాగంలో పని చేసే అధికారులు, సిబ్బందికి దానిపై అవగాహన లేకపోవడం కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీసింది. అక్రమ సర్టిఫికెట్లు పొందిన వారు ఉంటే వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. జారీ చేసిన సర్టిఫికెట్ల రద్దుతో నిజమైన వారికి ఇబ్బందులు తప్పవు. రద్దు అయిన విషయం వాటిని పొందిన వారికి కూడా తెలియదు. పాస్ పోర్టు, వీసా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ లు, ఆస్తుల రిజిస్ట్రేషన్లకు వెళ్లినప్పుడు అధికారులు ఆన్ లైన్ లో చెక్ చేస్తే కనిపించవు. అప్పుడు ఎలా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

అంతేకాదు, బల్దియా జారీ చేసిన సర్టిఫికెట్లను ఇతర విభాగాలు అనుమానంగా చూసే పరిస్థితి తలెత్తింది. మొత్తం మీద నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల అంశం ఇప్పుడు ఇటు అధికారులు అటు ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. మరోవైపు నకిలీ సర్టిఫికెట్ల అంశంపైనా సీబీతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్ల జారీ వెనుక ఎంఐఎం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి సర్టిఫికెట్లు పొందిన వారిలో ఎంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారో, ఎంతమంది పాకిస్తాన్ వాసులు ఉన్నారో తేల్చాలన్నారు. ఎంతమంది ఉగ్రవాదులకు ఫేక్ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేశారో సమగ్ర దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్.