Punjab Police nab Daaku Haseena: రూ.10ల డ్రింక్ సాయంతో డాకు హసీనాను పట్టుకున్న పోలీసులు

క్రైం థ్రిల్లర్ సినిమాలో లాగా భారీ దోపిడీలు చేసిన డాకు హసీనాను కేవలం పదిరూపాయల డ్రింక్ సాయంతో పోలీసులు పట్టుకున్నారు. ఈ కథ అచ్చు సినిమా కథలాగే ఉంది. దోపిడీలు చేస్తూ దొరకకుండా తిరుగుతున్న డాకు హసీనాను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు పట్టుకున్న కథ కమామీషు గురించి తెలుసుకుందాం రండి...

Punjab Police nab Daaku Haseena: రూ.10ల డ్రింక్ సాయంతో డాకు హసీనాను పట్టుకున్న పోలీసులు

ఘరానా దొంగ డాకు హసీనాను ఎలా పట్టుకున్నారంటే...

Punjab Police nab Daaku Haseena: దోపిడీలు చేస్తూ దొరకకుండా తిరుగుతున్న డాకు హసీనాను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. జూన్ 10వతేదీన లూథియానా నగరంలో జరిగిన రూ.8.4 కోట్లను దోపిడీకి పాల్పడిన డాకు హసీనాను పంజాబ్ పోలీసులు కేవలం పదిరూపాయల కూల్ డ్రింకుతో పట్టుకున్నారు. కేవలం పది రూపాయల కూల్ డ్రింక్ ఘరానా దొంగను పోలీసులకు పట్టిచ్చింది.

ఘరానా దొంగల జంట పుణ్యక్షేత్రాలు తిరుగుతూ …

డాకు హసీనాగా పిలిచే మన్‌దీప్ కౌర్ ఘరానా దోపిడీలకు పాల్పడింది.లూథియానాలో కోట్ల రూపాయలను దోచుకున్న డాకు హసీనా అలియాస్ మన్‌దీప్ కౌర్ తన భర్త జస్వీందర్ సింగ్ తో కలిసి నేపాల్ దేశానికి పారిపోయేందుకు పథకం పన్నారు.నేపాల్ పారిపోయే ముందు హరిద్వార్, కేదార్ నాథ్, హేమకుంబ్ సాహిబ్ లతో సహా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ఈ జంట పథకం వేసుకున్నారు.

రాణి తేనెటీగను పట్టుకుందాం అంటూ స్పెషల్ పోలీసు ఆపరేషన్

దొంగల జంట పుణ్యక్షేత్రాల సందర్శన, ఆపై నేపాల్ దేశానికి పారిపోవాలనే వ్యూహం గురించి పోలీసులకు సమాచారం అందింది. అంతే పంజాబ్ పోలీసుల డాకు హసీనాను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి ఈ ఆపరేషన్ కు ‘రాణి తేనెటీగను పట్టుకుందాం’ అని పేరు పెట్టారు.

పోలీసు ప్లాన్ ఏంటంటే…

లూథియానాలో దోపిడీని విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రతిగా నివాళులర్పించేందుకు డాకు హసీనా దంపతులు సిక్కు మందిరాన్ని సందర్శించారు.ఉత్తరాఖండ్‌లోని సిక్కు మందిరాన్ని సందర్శిస్తున్న భక్తుల్లో డాకు హసీనా జంటను గుర్తించడం కష్టం. దీంతో యాత్రికుల కోసం ఉచితంగా డ్రింక్ సర్వీస్ ఏర్పాటు చేయాలని పోలీసులు ప్లాన్ చేశారు.ఇదే సమయంలో నిందితులైన డాకు హసీనా దంపతులు డ్రింక్ స్టాల్ వద్దకు వచ్చారు. వారు పట్టుబడకుండా ఉండటానికి వారి ముఖాలను కప్పుకున్నారు. కానీ పోలీసులు ఏర్పాటు చేసిన డ్రింక్ తాగడానికి వారి ముఖాలను తెరవవలసి వచ్చింది. దీంతో పోలీసులు వారిని గుర్తించారు.

వెంబడించి పట్టుకున్నారు…

డాకు జంటను పోలీసులు వెంబడించారు,అనంతరం వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.మన్‌దీప్ కౌర్, ఆమె భర్త జస్విందర్ సింగ్‌ను అరెస్టు చేశారు. దంపతులే కాకుండా పంజాబ్‌లోని గిద్దర్‌బాహాకు చెందిన మరో నిందితుడు గౌరవ్‌ను కూడా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో నిందితులుగా ఉన్న 12 మందిలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మన్‌దీప్ కౌర్ అలియాస్ డాకు హసీనా ఎవరంటే?

లూథియానా నగరంలో 8.49 కోట్ల రూపాయల దోపిడీ వెనుక నిందితుల్లో డాకు హసీనా అని పిలిచే మన్‌దీప్ కౌర్ నిందితురాలు. ఆమె జూన్ 10వతేదీన న్యూ రాజ్‌గురు నగర్ ప్రాంతంలోని కార్యాలయంలో సీఎంఎస్ సెక్యూరిటీస్ కంపెనీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను బందీగా చేసి, అత్యంత చాకచక్యంగా దోపిడీ చేసింది. ఇప్పటి వరకు జరిపిన పోలీసుల విచారణలో డాకు హసీనా ధనవంతురాలు కావాలనుకున్నట్లు తేలింది. ఆమె అప్పులు చేసి, అంతకుముందు ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా,లాయర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసింది. ఆమెకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జస్వీందర్ సింగ్‌తో వివాహం జరిగింది.