ప్రేమ పెళ్ళి….హీటర్ తో కొట్టి భార్యను హత్య చేసిన భర్త

అమ్మను కొట్టోద్దునాన్నా అని కన్న కూతురు వేడుకుంటున్నా మద్యం మత్తులో ఉన్న భర్త, భార్యను చావబాదాడు. బాలింతరాలైన భార్య, మొగుడు కొట్టిన దెబ్బలకు తనువు చాలించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చూడ చక్కనైన నలుగురు పిల్లలు… మంచి వ్యాపారం… సజావుగా సాగిపోతున్న కాపురంలో అదనపు కట్నం కోసం భార్యను వేధించసాగాడు భర్త. భార్య నుంచి పైసా కట్నం రాకపోవటంతో ఆమెను వేధించసాగాడు. ఈక్రమంలోనే శనివారం రాత్రి భార్యభర్తల మధ్య జరిగిన ఘర్షణలో నీళ్ళు కాచుకునే హీటర్ తో భార్యను విచక్షణా రహితంగా కొట్టి ప్రాణం తీశాడు.
బంజారా హిల్స్, రోడ్ నెంబరు2, ఇందిరా నగర్ లో ఉండే రుడావత్ అనిల్(31) వికారాబాద్ జిల్లా, దౌలతాబాద్ మండలం, గొడమర్రి తండాకు చెందిన అనితను 2009లో ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. సినిమా సెట్టింగులు,డెకరేషన్ మెటీరియల్ సామాగ్రి అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి మొత్తం నలుగురు సంతానం. ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కాగా..వీరికి నెలన్నరక్రితం మరో బాబు పుట్టాడు.
కొన్నాళ్లు వారి కాపురం సజావుగా సాగినా అనిల్ భార్య అనితను అదనపు కట్నం కోసం వేధించసాగాడు. అనుమానంతో భార్యను దారుణంగా కొట్టేవాడు. ఈవిషయమై పలుమార్లు పెద్దల దగ్గర పంచాయతీ జరిగినా అనిల్ ప్రవర్తనలో మార్పు రాలేదు. విసుగు చెందిన అనిత రెండేళ్లక్రితం పోలీసులకు ఫిర్యదు చేసింది. భార్యభర్తలు ఇద్దరిని భరోసా కేంద్రానికి పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా తీరు మార్చుకోని అనిల్ ప్రతిరోజు భార్యను వేధించసాగాడు.
శనివారం మే 30వ తేదీ రాత్రి బాగా తాగివచ్చిన అనిల్ భార్య అనితతో గొడవపడ్డాడు. ఈక్రమంలో ఆమెపై పిడిగుద్దులతో దాడి చేశాడు. కోపం చల్లారక ఇంట్లో వేడినీళ్లు పెట్టుకోటానికి ఉపయోగించే హీటర్ తో తీవ్రంగా కొట్టాడు. తండ్రి తల్లి ని కొడుతున్నప్పడు వచ్చిన శబ్దాలకు లేచిన కూతురు..నాన్నా అమ్మను కొట్టద్దు నాన్నా..అని వేడుకున్నాపెడచెవిన పెట్టి అనిల్ భార్యను కొట్టాడు. అనిల్ కొట్టిన దెబ్బలకు అనిత అక్కడి కక్కడే చనిపోయింది.
భార్య మృతి చెందిందని తెలుసుకున్న అనిల్ అక్కడి నుంచి పరారయ్యాడు. పిల్లలు ఏడవటం గమనించిన స్ధానికులు ఇంటికి వచ్చిచూసి అనిత మరణించిన సంగతి పొలీసులుకు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. అనిత మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు మోహన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తల్లి మరణించటం, తండ్రి పరారవటంతో చిన్నారులు బిక్కు బిక్కు మంటూ గడుపుతున్న పిల్లల్ని చూసి బస్తీవాసులు కంట తడిపెడుతున్నారు.