ఇది దాంపత్యమంటే : అవినీతిలో ఆలుమగలు

దంపతులిద్దరూ ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ ఇచ్చిన వేతనం కాకుండా..ఇంకా సంపాదించాలనే ఆశ..వారిని అక్రమమార్గంలో పయనించేలా చేసింది. రెండు నెలలు తిరక్కుండానే ఇద్దరూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. రూ. 93 లక్షల నగదును ఇంట్లో ఉంచుకుని కేశంపేట తహశీల్దార్ లావణ్య జులైలో ఏసీబీ అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆమె భర్త, మున్సిపల్ ప్రాంతీయ కార్యాలయ సూపరింటెండెంట్ సునావత్ వెంకటేశ్వర్ నాయక్ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ అచ్చేశ్వర రావు బృందం..2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాత్రి అరెస్టు చేసింది.
మాసబ్ ట్యాంకులోని మున్సిపల్ ప్రాంతీయ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో జాబ్ ఇప్పిస్తానని హన్మకొండకు చెందిన రణధీర్‌ను వెంకటేశ్వర్ నాయక్ నమ్మించాడు.
ఇందుకు ఖర్చు అవుతుందని చెప్పి..2018 జులైలో రూ. 2 లక్షల 50 వేలు తీసుకున్నాడు. జాబ్ వచ్చిందని రణధీర్ ఫుల్ ఖుష్ అయ్యాడు. ఈ క్రమంలో అదే ఆపీసులో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని ప్రసూతి సెలవుపై వెళ్లింది. ఈమెకు వచ్చే జీతం రణధీర్ ఖాతాలో వేయించాడు వెంకటేశ్వర్. ఈ సంవత్సరం జనవరిలో ప్రసూతి తిరిగి విధుల్లో చేరింది. తిరిగి రావడంతో రణధీర్‌కు జీతం ఇవ్వలేకపోయాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో మున్సిపల్ శాఖ ప్రాంతీయ అధికారిని రణధీర్ కలిశాడు. తనకు ఇచ్చిన నియామక పత్రాన్ని చూపించాడు. అది ఫేక్ అని తేల్చారు.
అయినా..సరే..ఇంకా రూ. 40 వేలు ఇస్తే..ఈపీఎఫ్, ఈఎఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తానంటూ..రణధీర్‌కు వెంకటేశ్వర్ ఆశ చూపించాడు. డబ్బు ఇవ్వను..తనకు రావాల్సిన నాలుగు నెలల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశాడు రణధీర్. పోలీసులకు పట్టిస్తానని వెంకటేశ్వర్ బెదిరించాడు. దీంతో భయపడి హన్మకొండకు వెళ్లిపోయాడు. ఇటీవలే లావణ్యను అరెస్టు చేసిన సంగతి తెలుసుకున్నాడు. ఈమె వెంకటేశ్వర్ నాయక్ భార్య అని రణధీర్ తెలుసుకుని..ధైర్యం తెచ్చుకుని రెండు వారాల క్రితం ఏసీబీ ఎస్పీని అచ్చేశ్వరరావును కలిసి..జరిగిదంతా చెప్పాడు. తన వద్దనున్న ఆధారాలన్నింటినీ చూపించాడు.
వెంకటేశ్వర్ నాయక్ ఎక్కడకు వెళుతున్నారు..ఏమి చేస్తున్నాడో తెలుసుకొనేందుకు ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. తర్వాత శుక్రవారం వెంకటేశ్వర్‌తో పాటు ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నాయక్, లావణ్యలు బాధితుల నుంచి లక్షల రూపాయలను దండుకున్నట్లు గుర్తించారు. రణధీర్ ఏసీబీని ఆశ్రయించడంతో వెంకటేశ్వర నాయక్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతడిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ అచ్చేశ్వరరావు వెల్లడించారు.