రెండో పెళ్ళి చేసుకున్నందుకు మనస్తాపంతో ఆత్మహత్య

జీవితంలో రెండో పెళ్లి చేసుకున్నందుకు మనస్తాపం చెందిన ఒక డాక్టర్ సూసైడ్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్ నగర్లో నివాసం ఉండే శ్రావణి (35) వైద్యురాలిగా పనిచేస్తోంది. ఈమె కొన్నేళ్ల క్రితం భర్తతో మనస్పర్ధలు రావటంతో అతడి నుంచి విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు.
కాగా.. శ్రావణి గత నవంబర్ 1 ను శ్రీనివాస్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ద్వితీయ వివాహం చేసుకుంది. శ్రీనివాస్ ఉద్యోగం కోసం తమిళనాడు వెళ్లగా, శ్రావణి తన తల్లితండ్రులతో కలిసి హైదరాబాద్లోనే ఉంటోంది. మంగళవారం ఉదయం ఆమె బాత్రూంలో కిటీకీకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మధ్యాహ్నం ఆమె తల్లి తలుపులు కొట్టినా లోపలి నుంచి సమాధానం రాకపోవటంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు విరగ్గొట్టి చూసింది. అక్కడ శ్రావణి ఉరికి వేలాడుతూ కనిపించింది.
సంఘటనా స్ధలానికి చేరుకున్నపోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. తన ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని….తల్లితండ్రులు తనను బాగా చూసుకున్నారని, తొందరపడి తాను రెండో వివాహం చేసుకున్నానని …అతను ఎలా చూసుకుంటాడో తెలియదని.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో పేర్కోంది. మృతురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.