గంజాయి మాఫియా : లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్సు‌ల్లోనూ గంజాయి రవాణా

  • Published By: bheemraj ,Published On : July 8, 2020 / 08:02 PM IST
గంజాయి మాఫియా : లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్సు‌ల్లోనూ గంజాయి రవాణా

Updated On : July 8, 2020 / 8:12 PM IST

సందట్లో సడేమియాలా గంజాయి మాఫియా రెచ్చిపోతోంది. లారీలు, ఆటోల్లోనే కాదు అంబులెన్స్‌ల్లోనూ గంజాయి రవాణా జరుగుతోంది. తమిళనాడు వయా ఏపీ, తెలంగాణ టూ కర్నాటకకు సప్లయ్‌ చేస్తున్నారు. సీక్రెట్‌గా పండించే సరుకు అవలీలగా బార్డర్‌ దాటేస్తోంది..? గంజాయి దందాలో సూత్రధారులెవరు..? పాత్రధారులెవరు..? గంజాయి గ్యాంగ్‌లు తనిఖీలను లెక్కచేయడం లేదు. రోజురోజుకి అక్రమార్కులు తెలివిమీరిపోతున్నారు. కారు ప్రమాదంతో గంజాయి దందా బయటపడింది.

ఇక్కడా అక్కడా అని తేడా లేదు తెలుగురాష్ట్రాల్లో ఎక్కడపడితే అక్కడ గంజాయి గుప్పుమంటోంది. చాలా చోట్ల చెక్‌పోస్ట్‌లున్నాయని తెలుసు.. తనిఖీలు జరుగుతాయని తెలుసు.. అయినా వీటిని లెక్కచేయడం లేదు మత్తు మాఫియా. పట్టుబడితే గానీ సరుకు అక్కడ దాచిపెట్టారా అన్న సంగతి తెలియడం లేదంటే అక్రమార్కులు ఏ స్థాయిలో తెలివిమీరుతున్నారో స్పష్టమవుతోంది. నల్గొండజిల్లా నకిరేకల్ మండలం చందంపల్లిలో వారం రోజుల క్రితం ఓ కారు ప్రమాదానికి గురైంది. గమనించిన స్థానికులు వెంటనే కారులో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ముగ్గురు పరార్ అయ్యారు. ఫ్రంట్ సైడ్‌ కారు మొత్తం డ్యామేజ్ అయింది. బ్యాక్‌కి వెళ్లి చూస్తే గంజాయి వాసన గత్తర లేపింది.

పకడ్బందీగా ప్యాక్ చేసిన 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆరాతీస్తున్నారు. కానీ బట్వాడా చేస్తున్న గ్యాంగ్‌ మాత్రం పట్టుబడలేదు. తెలివితేటల్ని స్టూడెంట్స్ రాంగ్‌రూట్‌లో అప్లయ్ చేస్తోన్నారు. లిక్విడ్ బాటిల్స్‌లో గంజాయి నింపి విక్రయాలు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన బ్యాచ్‌ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అడ్డదారులు తొక్కారు. అందరూ డిగ్రీ విద్యార్థులే. తమ తెలివితేటల్ని రాంగ్‌ రూట్‌లో అప్లయ్ చేసి.. గంజాయి రవాణా షురూ చేశారు. సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందిపుచ్చుకుని లిక్విడ్ బాటిల్స్‌లో గంజాయిని నింపి విక్రయిస్తున్నారు. ఆనోటా ఈనోటా ఈ మ్యాటర్ పోలీసుల చెవిన పడడంతో వీరి తాటతీశారు. మొత్తం 8మంది సభ్యుల ముఠాను అరెస్ట్‌ చేశారు. గంజాయితో పాటు లిక్విడ్ బాటిల్స్‌ను సీజ్ చేశారు.

ఖమ్మంలో మరో తరహా గంజాయి ఎక్స్‌పోర్ట్‌ ఖాకీలను అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా ట్రాక్టర్‌ని చూస్తే పొలం పనులకు వెళ్తుందని భావిస్తారంతా. ఆ అంచనాలను క్యాష్‌ చేసుకుంది ఈ గ్యాంగ్‌. ఏకంగా 41బ్యాగుల్లో 40లక్షల విలువ చేసే గంజాయిని కుక్కేసింది. ట్రాక్టర్ కింది భాగంలో ప్యాకెట్లను సెట్‌ చేసి రవాణాకు ప్లాన్ చేసింది. కానీ అంతలోనే సీన్ రివర్సయింది. ట్రాక్టర్ గేర్ మార్చకముందే ముగ్గురు సభ్యుల ముఠా పోలీసులకు చిక్కింది. దీని వెనుక మాస్టర్‌ ప్లాన్‌ మహబూబాబాద్‌ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన శంకర్‌దేనని గుర్తించారు. వాహనాల చాటున గంజాయి ట్రాన్స్‌పోర్ట్‌కి మహత్తరమైన ప్లాన్ చేశారు. ఒరిస్సాలోని దారకొండలో పండించిన పంటను ఉత్తరప్రదేశ్‌కు తరలించాలని గంజాయి గ్యాంగ్‌ భావించింది. అయితే తూర్పు ఏజెన్సీలోని వై రామవరం మండలం డొంకరాయిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. డ్రైవర్‌పై అనుమానంతో కంటైనర్‌ డోర్లు ఓపెన్ చేస్తే మత్తు వాసన మతిపోగెట్టేలా చేసింది. తీగలాగితే. 60లక్షల విలువ చేసే మాల్ బయటపడింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మత్తు మాఫియా కొత్త లింక్‌లు ఖాకీలను షేక్ చేశాయి. జేకే కాలనీకి చెందిన ప్రవీణ్, నునావత్‌ జ్యోతి, లీలాపాసిలు ముఠాగా ఏర్పడి చత్తీస్‌గఢ్‌ నుంచి గంజాయిని ఇంపోర్ట్‌ చేసుకుంటున్నారు. కిలోలకొద్ది గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. లాభసాటి భేరం కావడంతో ఫుల్‌ టైమ్‌ బిజినెస్‌ చేసింది. పక్కా సమాచారంతో గంజాయి డెన్‌పై దాడి చేయడంతో దందా గుట్టురట్టయింది.

విశాఖలో ఎక్సైజ్, సివిల్ పోలీసులు సంయుక్తంగా ఎన్ని చర్యలు తీసుకున్నా గంజాయి రవాణాను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఏదో ఒక రూట్‌లో ఏదో రకంగా తరలిస్తూనే ఉంది గంజాయి మాఫియా. నిజం చెప్పాలంటే ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం గంజాయి సాగుకి అడ్డాగా మారింది. నెల రోజుల వ్యవధిలో 8వేల కిలోల గంజాయి, 55మంది అరెస్ట్‌ అయ్యారంటే వీళ్ల వ్యాపారం ఏ రేంజ్‌లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. జికేవీధి, పెదబయలు, జి.మాడుగుల, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల నుంచి నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతోంది.

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని లింక్‌లు విశాఖతోనే ముడిపడి ఉంటున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత ఎస్‌ఈబీ అధికారులు కూడా నిఘా పెంచారు. దీంతో గుట్టలు గుట్టలుగా గంజాయి పట్టుబడుతూనే ఉంది. దొరుకుతున్నది కొంతే అయినా పోలీసుల కళ్లుగప్పి.. దొడ్డిదారిన పెద్ద మొత్తంలోనే తరలిపోతుందనే అనుమానాలు ఉన్నాయి. ప్రధాన రహదారుల్లో వెళ్తే దొరికిపోతున్నామని భావిస్తున్న అక్రమార్కులు.. అడ్డదారులు, షార్ట్‌కట్‌ రూట్‌లను ఎంచుకుంటూ గంజాయి లోడ్‌లను తరలిస్తున్నారు.