దారుణం : బాలికపై అత్యాచారం, హత్య

యాదాద్రి: భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న పాముల శ్రావణి అనే విద్యార్థినిపై కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని బావిలో పడేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకోగా స్ధానికులు పోలీసులపై దాడి చేశారు.
వివరాల్లోకి వెళితే మేడ్చల్ జిల్లా కీసర లోని జెడ్పీహెచ్ స్కూలులో శ్రావణి 9వ తరగతి చదువుతోంది. గురువారం స్కూల్లో స్పెషల్ క్లాసు ఉందని హాజీపూర్ నుంచి వెళ్లింది. స్కూలు కు వెళ్లిన శ్రావణి ఎంత సేపటికీ తిరిగి రాకపోవటంతో తల్లి తండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు గ్రామ శివారులోని పాడుబడిన మర్రి బావిలో శ్రావణి మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో గ్రామస్తులు కొందరిపై అనుమానం వ్యక్తం చేశారు. అనుమానితులను అరెస్టు చేసి బావిలోంచి మృతదేహాన్ని తీయాలని గ్రామస్తులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది.