నిర్భయ దోషుల పిటీషన్లు కొట్టివేత

నిర్భయ దోషుల తరుపున శుక్రవారం దాఖలైన పిటీషన్లను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. దోషులు క్యురేటివ్ పిటీషన్లు, క్షమాభిక్ష పిటీషన్లు వేసుకునేందుకు తీహార్ జైలు అధికారులు అవసరమైన కాగితాలు ఇవ్వలేదని ఆరోపిస్తూ పిటీషన్లు తరుఫు న్యాయవాది ఏపీ సింగ్ నిన్న కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ పై శనివారం ఢిల్లీ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి అజయ్ కుమార్ విచారణ జరిపారు. దోషుల తరుపున హజరైన న్యాయవాది ఏపీ సింగ్ మొదట తన వాదనలు వినిపించారు. నలుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మపై విష ప్రయోగం జరిగిందని అతనిపై స్లో పాయిజన్ ఇచ్చారని.. దాంతో అతను ఆస్పత్రి పాలయ్యాడని అతని మెడికల్ రిపోర్ట్స్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
ప్రస్తుతం వినయ్ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిపారు. అతడు జైల్లో ఆహారం కూడా తీసుకోవడం లేదని కోర్టుకు తెలియజేశారు. అధికారులు అతడి మెడికల్ రిపోర్టులు ఇస్తే క్షమాభిక్ష పెట్టుకునేందుకు ఉపయోగపడతాయని న్యాయవాది కోర్టుకు విన్నవించారు. వినయ్ కుమార్ కు సంబంధించిన డైరీ పెయింటిగ్స్ ను తీహార్ జైలు అధికారులు ఇవ్వలేదని దోషుల తరుఫు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టుకు విన్నవించారు.
ఢిల్లీ పోలీసుల తరుఫున వాదించిన న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ దోషుల తరుఫు న్యాయవాదికి అవసరమైన అన్ని పత్రాలు అందచేసినట్లు వివరించారు. ఉరిశిక్ష తప్పించుకునేందుకే నిందితులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు తెలిపింది. గతంలో వినయ్ ముకేశ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసుకోగా దాన్ని తిరస్కరించారు. దీంతో ముకేశ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరణకు గురైంది.
ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు నిర్భయ కేసు దోషులు నలుగురిని ఉరితీయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసింది. నిర్భయ దోషులైన వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్ (31), ముకేష్ కుమార్ సింగ్ (32), పవన్ గుప్తా (25)లకు ఫిబ్రవరి 1వతేదీన ఉరిశిక్ష విధించనున్న నేపథ్యంలో జాప్యం చేసేందుకు దోషులు వివిధ పిటిషన్లు వేసి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా కోర్టు దోషుల పిటిషన్లను కొట్టివేసింది.