Cyber Crime : గుండెలు పిండే విషాదం.. 50లక్షలు చెల్లించినా ఆగని సైబర్ నేరగాళ్ల వేధింపులు, వృద్ధ దంపతుల బలవన్మరణం..
సైబర్ నేరాల పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు.

Cyber Crime : సైబర్ నేరగాళ్ల వేధింపులు భరించలేక వృద్ధ దంపతులు బలవన్మరణం చేసుకున్నారు. 50 లక్షలు చెల్లించినా.. వేధింపులు ఆగకపోవడంతో మరో దారి లేక ప్రాణాలు తీసుకున్నారు. గుండెలు పిండే ఈ విషాదం…కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లా బీడీ గ్రామంలో చోటు చేసుకుంది.
డియోగో నజరత్(83, పావీయా నజరత్(79) దంపతులు. డియోగో నజరత్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. వీరు తమ ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి ఒక నోట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ నోట్ లో సంచలన విషయాలు బయటపడ్డాయి. సైబర్ నేరగాళ్ల వేధింపులతోనే వృద్ధ దంపతులు బలవన్మరణం చేసుకున్నట్లు తేలింది.
”వేధింపులు భరించలేకపోతున్నాం. ఇన్నాళ్లూ ఎంతో గౌరవంగా బతికాము. ఎవరి సాయం తీసుకుని, ఎవరి దయ మీద బతకాలని మాకు లేదు. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం” అని ఆ నోట్ లో ఉంది.
Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసు.. విజయవాడలో ఆ మూడు గంటలు ఆయన ఎక్కడున్నారు? పోలీసులు ఏం చెప్పారంటే..
ఆ నోట్ ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాఫ్తు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. సైబర్ క్రిమినల్స్ వేధింపుల పర్వం వెలుగు చూసింది. వృద్ధ దంపతులను సైబర్ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారని పోలీసులు విచారణలో బయటపడింది. కొన్ని రోజుల క్రితం వృద్ధ దంపతులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
అవతలి వ్యక్తులు తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా దగ్గర మీ ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయని వారిని ఫోన్‌లో బెదిరించారు. అడిగినంత డబ్బు ఇవ్వకంటే ఆ చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారు. దాంతో భయపడిపోయిన వృద్ధ దంపుతులు.. వారి వేధింపులు తట్టుకోలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా వేధింపులు ఆగలేదు. మరింత డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
సైబర్ నేరాల పట్ల పోలీసులు అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. ఎవరైనా ఫోన్ చేసి తాము పోలీసులం అని చెబితే, బెదిరిస్తే భయపడొద్దని పోలీసులు చెబుతున్నారు. వారు డబ్బులు డిమాండ్ చేస్తే ఇవ్వొద్దని అంటున్నారు. వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచిస్తున్నారు. అయినా, కొందరు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుకుతున్నారు. వారి బ్లాక్ మెయిల్ కు భయపడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.