పిజ్జా ఆర్డర్‌ చేస్తే రూ.95 వేలు దోచేశారు 

  • Published By: veegamteam ,Published On : December 6, 2019 / 09:42 AM IST
పిజ్జా ఆర్డర్‌ చేస్తే రూ.95 వేలు దోచేశారు 

Updated On : December 6, 2019 / 9:42 AM IST

యాప్‌లో పిజ్జా ఆర్డర్‌ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. సైబర్‌ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.95 వేలు దోచేశారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతానికి చెందిన ఎన్వీ షేక్‌ డిసెంబర్‌ 1వ తేదీన ఫోన్‌లో జుమాటో యాప్‌ ద్వారా పిజ్జా ఆర్డర్‌ చేశాడు. గంటపాటు ఎదురుచూసినా పిజ్జా అందకపోవడంతో కస్టమర్‌ కేర్‌ నెంబర్‌కు ఫోన్‌ చేశాడు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. 

‘రెస్టారెంట్‌ మీ ఆర్డర్‌ను స్వీకరించలేదు. మేము ఒక లింక్‌ పంపిస్తున్నాం. దానిని ఓపెన్‌ చేసి మీ వివరాలు నింపితే మీకు కచ్చితంగా రీఫండ్‌ వస్తుంది’ అని నమ్మబలికాడు. తన ఫోన్‌కు వచ్చిన లింక్‌ను ఓపెన్‌ చేసిన షేక్‌.. అడిగిన సమాచారం అంతా నింపారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే తన బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేలు విత్‌ డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. బ్యాంకులో ఉన్న మిగతా మొత్తాన్ని వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్‌ చేద్దామనుకునే లోపే రూ.50 వేలు విత్‌ డ్రా అయినట్లు మరో మెసేజ్‌ వచ్చింది. 

దీంతో ఎన్వీ షేక్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్యాన్సర్‌ బారిన పడిన తన తల్లికి చికిత్స కోసం దాచిన డబ్బును సైబర్‌నేరగాళ్లు దోచారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ లేదని జుమాటో సంస్థ ప్రతినిధి తెలిపారు. కస్టమర్లకు ఫోన్‌ చేసే సర్వీసు కంపెనీ లేదని స్పష్టం చేశారు.