పెళ్లి చేసుకుందని కూతుర్ని దహనం చేసిన తల్లిదండ్రులు

చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు.

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 02:03 PM IST
పెళ్లి చేసుకుందని కూతుర్ని దహనం చేసిన తల్లిదండ్రులు

Updated On : October 13, 2019 / 2:03 PM IST

చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు.

చిత్తూరు జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు. ఈ ఘటన శాంతిపురం మండలం రెడ్లపల్లిలో చోటుచేసుకుంది. చందన అనే యువతి రెండు రోజుల క్రితం శ్రీనివాస్ అనే యువకుడని ప్రేమ వివాహం చేసుకుంది. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పెద్దల మధ్యవర్తిత్వంతో ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంట్లో చందన అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఎవరికీ తెలియకుండా హుటాహుటిన తల్లిదండ్రులు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. అయితే చందన తల్లిదండ్రులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. కానీ వారి మాటల్లో పొంతన లేకపోవడం, ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించడంతో పోలీసులు పరువు హత్యగా అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే చందన తల్లిదండ్రులను విచారిస్తున్నారు. కుప్పం పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. 

రెడ్లపల్లి చెందిన చందన, శ్రీనివాస్ మధ్య ఏడాది కాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. చందన బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతి. తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం దగ్గర్లోని ఓ ఆలయానికి వెళ్లి చందన, శ్రీనివాసులు వివాహం చేసుకున్నారు. శనివారం (అక్టోబర్ 12, 2019) వారు తిరిగి ఇంటికి వచ్చారు. వారు గ్రామంలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి. పెద్దల మధ్యవర్తిత్వంతో శ్రీనివాస్ ను అతని ఇంటికి పంపించారు. చందనను ఆమె తల్లిదండ్రులు దగ్గరే ఉంచారు. 

అయితే శనివారం (అక్టోబర్ 12, 2019) రాత్రి ఎవరూ ఊహించని విధంగా చందన ఇంట్లో శవమై తేలింది. ఆమె ఎలా చనిపోయిందో ఇప్పటికీ అంతుచిక్కని సమస్యగా మారిపోయింది. చందన మరణించడంతో ఆ వెంటనే ఆమె తల్లిదండ్రులు ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. దహన సంస్కారాలు ముగిసిన తర్వాత చివరకు బూడిద, కాల్చిన తాలూకు ఆనవాళ్లు కానరాకుండా మూటగట్టి దగ్గర్లోని చెరువులో విసిరివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున వెలుగుచూసింది. దీంతో శాంతిపురం మండలమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బూడిద, ఆనవాళ్లు ఎక్కడ పడేశారో తెలుసుకునేందుకు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చందన నిజంగా ఉరివేసుకుని చనిపోయిందా లేదా తల్లిదండ్రులే చంపారా అనేది తేలాల్సివుంది. చందన తండ్రి వెంకటేశ్ మాట్లాడుతూ వారిని దూరంగా ఉంచాలని ప్రయత్నం చేశామని చెప్పారు. తమ కుమార్తె ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయిందన్నారు. తమ గ్రామ సంప్రదాయం ఉరివేసుకున్న వారిని ఇంట్లో ఉంచకూడదన్న క్రమంలో అర్ధరాత్రి వేళ గ్రామ పెద్దలమంతా కలిసి దహన సంస్కారాలు పూర్తి చేశామని చెప్పారు. అయితే వెంకటేశ్ మాటల్లో వాస్తవం, నిజాయితీ కనిపించలేదు. కుప్పం పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టారు.

జిల్లాలో ఇలాంటి ఘటనలు వరుసుగా చోటుచేసుకుంటున్నాయి. మూడు నెలల్లో ఇది మూడో ఘటనగా భావిస్తున్నారు. శ్రీనివాస్ పరారీలో ఉన్నాడు. యువతి తరపు గ్రామస్తులు తమను చంపేస్తారని.. ఇప్పటికే భార్యను చంపేశారు కాబట్టి తమను కూడా చంపేస్తారనే భయంతో యువకుడు, అతని తండ్రి పరారీలో ఉన్నారు. శ్రీనివాస్ తల్లి మాత్రం తమ కోడల్ని ఆమె తల్లిదండ్రులే చంపేశారని చెబుతోంది.