Rayachoti Terrorists: పేరుకేమో చీరల వ్యాపారం, చేసేదేమో బాంబుల తయారీ.. రాయచోటిలో ఉగ్రవాదుల కలకలం.. 20ఏళ్లుగా అక్కడే నివాసం..
ఉగ్రవాదులు పెళ్లి చేసుకున్న మహిళల వివరాలు, వివాహం జరిపించిన పెళ్లి పెద్దలపై కన్నేసిన ఖాకీలు అదే స్థాయిలో విచారణ చేస్తున్నారు.

Rayachoti Terrorists: పేరుకేమో బంగారం, చీరల వ్యాపారం.. చేసేదేమో బాంబుల తయారీ. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 20ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి, స్థానికులతో కలిసిపోవడమే కాదు, ఏకంగా లోకల్ లేడీస్ ను మ్యారేజ్ చేసుకుని సాఫీగా బాంబుల తయారీ మొదలుపెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన చెన్నై ఐబీ పోలీసులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. కేసును ఓ ఛాలెంజ్ గా తీసుకున్న లోకల్ పోలీసుల ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. దర్యాఫ్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.
రాయచోటిలో ఉగ్రమూకల కదలికలు కలకలం రేపాయి. దర్యాఫ్తును వేగవంతం చేసిన పోలీసులు రాయచోటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అదనపు బలగాలు మోహరించారు. రాయచోటి నుంచి బయటకు వెళ్లే వాహనాలు, లోపలికి వచ్చే వాహనాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రాయచోటితో పాటు ప్రధాన వ్యాపార సముదాయాలైన ప్రొద్దుటూరు, కడప ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు. ఉగ్రవాదులు పెళ్లి చేసుకున్న మహిళల వివరాలు, వివాహం జరిపించిన పెళ్లి పెద్దలపై కన్నేసిన ఖాకీలు అదే స్థాయిలో విచారణ చేస్తున్నారు.
గతంలో రాయచోటిలో జరిగిన అల్లర్లతో ఉగ్రమూకలకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. పట్టుకున్న సామాగ్రిని ఉగ్రవాదులు ఎక్కడెక్కడి నుంచి సేకరించారు అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు వీలైనంత గోప్యత పాటిస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు అమానుల్లా అలియాస్ అబూబకర్ సిద్ధిఖీ, మన్సూర్ అలియాస్ మహ్మద్ అలీ పట్టుబడ్డారు. దాదాపు 20కిపైగా బాంబు పేలుడు కేసుల్లో వీరిద్దరూ ప్రధాన నిందితులుగా ఉన్నారు. తమిళనాడు పోలీసులు తీసుకెళ్లిన ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు చేసి సిద్ధిఖీ భార్య సైరా భాను, మహ్మద్ అలీ భార్య సైరా షమీమ్.. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
Also Read: ఓర్నీ.. ఇదేం పాడుపనిరా సామీ.. ముందు దేవుడు పటాలు.. వాటి వెనకాల చూస్తే అవాక్కవ్వాల్సిందే..
పట్టుబడ్డ ఉగ్రవాదులు ఇద్దరూ ఆలుమ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరి ఇళ్లలో భయంకరమైన పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకుని రాయచోటి శివార్లలో అక్టోపస్ టీమ్ సహకారంతో వాటిని నిర్వీర్యం చేశారు. భారీగా సేకరించిన మందుగుండు సామాగ్రితో భవిష్యత్తులో జరగబోయే పేలుళ్లకు అడ్డుకట్ట వేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
గత 20 ఏళ్లుగా జనంలో కలిసిపోయారు. ఎవరికీ అనుమానం రానివ్వలేదు. స్థానికంగా ఉన్న మహిళలను వివాహం చేసుకుని తమ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. 2013లో బెంగళూరులో జరిగిన బాంబు పేలుళ్ల కుట్ర రాయచోటి కేంద్రంగా జరిగిన ఆనవాళ్లు గుర్తించారు. దాదాపు 30 కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉంటూ ఉగ్రస్థావరాలను ఏర్పాటు చేసుకుని దేశంలోని ప్రధాన నగరాల మ్యాపులు, రైల్వే ట్రాక్ ద్వారా కుట్ర చేసే వ్యక్తులతో సంబంధాలు కొనసాగించినట్లు విచారణలో తేలింది.
20ఏళ్ల కిందట రాయచోటిని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం అభివృద్ధికి దూరంగా ఉండటం. అలాగే గ్రామీణ ప్రాంతం కావటంతో పాటు ముస్లిం కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావటం కలిసి వచ్చాయి. వీటిని అదనుగా చేసుకుని సాధారణంగా దొరికే వస్తువులతో అసాధారణ పేలుళ్లకు అవసరమైన బాంబులు తయారు చేస్తూ వచ్చారు. ఎవరికీ చిన్న అనుమానం కూడా కలగకుండా చూసుకున్నారు.